Arvind Kejriwal: విపశ్యన ధ్యానం కోర్సుకు వెళ్లనున్న కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విపశ్యన ధ్యానానికి వెళుతున్నారు. ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత కేజ్రీవాల్ పార్టీ కార్యక్రమాలలో మినహా బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఆయన పది రోజుల పాటు విపశ్యన ధ్యాన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన పంజాబ్‌లోని హోషియార్‌పుర్ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 5 నుంచి 15 వరకు ఆయన ధ్యాన కేంద్రంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ గతంలోనూ విపశ్యన ధ్యానం చేశారు. 2023 డిసెంబర్ నెలలో పది రోజుల పాటు హోషియార్‌పుర్ ధ్యాన కేంద్రంలో ఉన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిదేళ్ల పాటు పరిపాలన సాగించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు గానూ కేవలం 22 స్థానాలకే పరిమితం కావడంతో పాటు స్వయంగా పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా పరాజయం పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి కేజ్రీవాల్ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
విపశ్యన మెడిటేషన్ అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి. ఇందులో అభ్యాసకులు వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోడానికి కోర్సు పూర్తయ్యేవరకు పదిరోజుల పాటు ఎవరితో మాట్లాడకుండా ఉంటారు. అలాగే అభ్యాసన కేంద్రం నుంచి బయటకు రావడం అనేది ఉండదు. బయటివ్యక్తులకు ఇందులో ప్రవేశం ఉండదు. కాగా, కేజ్రీవాల్ చాలా కాలంగా విపశ్యన ధ్యాన సాధన చేస్తున్నారు. గతంలో బెంగళూరు, జైపూర్‌తోసహా అనేక ప్రాంతాల్లో ఆయన ధ్యానం సాధన చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com