G20 Summit: ముగిసిన జీ-20 సదస్సు

ఢిల్లీలో రెండురోజుల పాటు జరిగిన జీ-20 సదస్సు ఆదివారం ముగిసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో విశ్వ శాంతిని కాంక్షిస్తూ జరిగిన ప్రార్ధనలతో సదస్సు ముగిసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జీ20 సదస్సు ముగిసినట్టు ప్రకటిస్తున్నాను..వసుధైక కుటుంబానికి రోడ్‌మ్యాప్ దిశగా మనం ముందుకు సాగుతామని ఆకాంక్షిస్తున్నా అని మోదీ తన ముగింపు ఉపన్యాసంలో పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష అధికార దండాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డిసిల్వాకు ప్రధాని మోదీ అందచేశారు. సదస్సులో చర్చించిన అంశాలపై సమీక్షించేందుకు ఈ ఏడాది నవంబర్ మాసాంతంలో వర్చువల్ భేటీ జరగాలని మోదీ ప్రతిపాదించారు.
సదస్సులో ముందుకొచ్చిన సూచనలు, అంశాలపై చర్యలు, పురోగతిని సమీక్షించాల్సిన అవసంర ఉందని వ్యాఖ్యానించారు. 2024లో జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న బ్రెజిల్ అధ్యక్షుడిని ప్రధాని మోదీ అభినందించారు. ఇక అంతకుముందు జీ20 (G20) సదస్సు రెండో రోజు ఆదివారం పలు దేశాధినేతలు, ప్రతినిధులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మగాంధీకి నివాళులు అర్పించారు. సదస్సు చివరిరోజు జీ20 అధ్యక్ష అధికార దండాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడికి అందచేశారు. మరోవైపు ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్యుడిగా జీ20 స్వాగతించింది.
భారత్ ఆతిధ్యంలో ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెక్షన్ సెంటర్‌లో శనివారం నుంచి జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సదస్సు థీమ్‌గా ఒక భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్‌ను ప్రతిబింబించే వసుధైక కుటుంబ భావనను ఎంచుకున్నారు. మరోవైపు జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఢిల్లీ చేరుకుని అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆదివారం ఉదయం ఆయన వియత్నాం వెళ్లారు. మరోవైపు ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్యుడిగా జీ20 స్వాగతించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com