MALDIVES: కుదేలైన మాల్దీవుల పర్యాటకం

దౌత్యపరమైన వివాదంతో కుదేలైన మాల్దీవుల పర్యటక సంస్థలు భారతీయులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. భారత్‌లోని ప్రముఖ నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఇరుదేశాల మధ్య ప్రయాణ, పర్యటక సహకారాన్ని పెంపొందించడంపై మాల్దీవుల ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్ల సంఘం.. మటాటో ప్రతినిధులు మాలేలో భారత హైకమిషనర్‌తో చర్చలు జరిపారు. మాల్దీవులకు భారత్ ఇప్పటికీ కీలకమైన మార్కెట్ అని మటాటో ఈ సందర్భంగా ప్రకటించింది. మాల్దీవులను ప్రధాన గమ్యస్థానంగా మరింత ప్రోత్సహించేందుకు భారత్ ట్రావెల్ అసోసియేషన్‌లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు ఇన్‌ఫ్లుయెన్సర్లు, ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొంది. పర్యటక సంబంధాలను పెంపొందించడం, ఆ రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించడంలో భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తామని మటాటో ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ప్రధాని మోదీ ప్రభావంతో లక్షద్వీప్‌లో సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే,..
ప్రధాని మోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు మరియం షియూనా, మాల్షా షరీఫ్, మజూమ్ మాజిద్.. చేసిన అనుచిత వ్యాఖ్యల అనంతరం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ దేశంపై ఆగ్రహావేశాలు కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాలేదు. వేలాది మంది భారతీయులు ఇప్పటికే వచ్చే సెలవుల్లో అక్కడికి వెళ్లేందుకు బుక్ చేసుకున్న విమాన టికెట్లు, హోటల్ రూమ్‌లను రద్దు చేసుకుంటున్నారు. వివాదం నేపథ్యంలో ఇప్పటి వరకూ దాదాపు 8000 హోటల్ బుకింగ్స్, 2,500 విమాన టికెట్లను భారతీయులు రద్దు చేసుకున్నారు. కాగా, ప్రధాని మోదీ పర్యటన తర్వాత భారత్‌లోని ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీ్‌పపై ఆసక్తి పెరిగింది. అయితే.. మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యల తర్వాత సామాజిక మాధ్యమాల్లో ‘చలో లక్షద్వీప్’ ఉద్యమం ఊపందుకుంది.
భారత్‌పై మాల్దీవులు ఎలా ఆధారపడుతోంది?
మాల్దీవుల్లో పర్యాటక పరిశ్రమకు మద్దతునిచ్చేందుకు ఈ దేశంలోని 34 ద్వీపాల్లో నీరు, పారిశుధ్యం వంటి మౌలికవసతుల ప్రాజెక్టుల్లో భారత్ భాగస్వామ్యమైందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. హరిమదూ అంతర్జాతీయ విమానాశ్రయ పునర్నిర్మాణ ప్రాజెక్టు, గన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రీ డెవల్‌పమెంట్ వంటి ఎనిమిది ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. భారత్‌లోని లగ్జరీ హోటళ్లయిన తాజ్, ఒబెరాయ్ వంటి సంస్థలు కూడా ఇక్కడ తమ సేవలందిస్తున్నాయి. అలాగే ఇక్కడి పరిశ్రమల్లో మానవ వనరుల అవసరాన్ని కూడా భారత్ భర్తీ చేస్తోంది. ఈ దేశం పర్యాటకంతోపాటు వ్యవసాయం, చేపల వేటపై ఎక్కువగా ఆధారపడుతోంది. దీనికి 1974 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐలాండ్ రిసార్ట్స్ అభివృద్ధి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, వివిధ వాణిజ్య వెంచర్ల కోసం రుణ సాయం అందిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com