Lok Sabha Elections: యూపీలో మజ్లిస్ పార్టీకి తోడు

Lok Sabha Elections: యూపీలో  మజ్లిస్ పార్టీకి తోడు
అప్నాదళ్(కే)తో అసదుద్దీన్ ఓవైసీ పొత్తు..

అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని మజ్లిస్ పార్టీకి ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లో ఒక మిత్రపక్షం దొరికింది. యూపీలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్ (కమేరావాది)తో కలిసి మజ్లిస్ పోటీ చేయనుంది. ‘పిచ్డా, దళిత్ ఔర్ ముసల్మాన్’ (పీడీఎం) పేరుతో ఏర్పాటైన ఈ కూటమికి అప్నా దళ్ అగ్ర నాయకురాలు పల్లవి పటేల్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సారథ్యం వహించనున్నారు. ‘పిచ్డా, దళిత్ ఔర్ ముసల్మాన్’ అర్థం ‘‘పిచ్డా(వెనకబడిన), దళిత్, ముస్లిం’’.

ప్రేమ్‌చంద్ బింద్‌కు చెందిన ప్రగతిశీల మానవ్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ ఉదయ్ పార్టీలు కూడా ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇంతకుముందు సమాజ్ వాదీ పార్టీతో అప్నా దళ్‌కు పొత్తు ఉండేది. 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా దళ్ చీఫ్ పల్లవి పటేల్ సమాజ్ వాదీ పార్టీ గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా.. ఒక దళిత అభ్యర్థికి మాత్రమే పల్లవి పటేల్ ఓటు వేశారు. మిగతా ఇద్దరికి ఓటు వేసేందుకు ఆమె నిరాకరించారు. దీంతో అప్నాదళ్, సమాజ్ వాదీ పార్టీల మధ్యనున్న పొత్తుకు విఘాతం కలిగింది.

యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ(ఎస్పీ)తో అప్నాదళ్(కే) పొత్తు విచ్ఛిన్నమైన తర్వాత ఎంఐఎంతో పొత్తు కుదిరింది. ఈ కూటమిలో సీట్ల పంపకాలపై రానున్న రోజుల్లో ప్రకటన వెలువడనుంది. ఇది కేవలం లోక్‌సభ ఎన్నికల కోసం మాత్రమే కాదని, ఉత్తర్ ప్రదేశ్ ప్రజల కోసమని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ‘‘మేము పల్లవి పటేల్‌తో పొత్తు పెట్టుకున్నామని, మేము మొదటిసారి కలిసినప్పుడు ఈ పోరాటాన్ని లోక్‌సభ ఎన్నికల వరకు మాత్రమే కాకుండా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ముందుకు తీసుకెళ్తాము’’ అని ఓవైసీ చెప్పారు.

అట్టడుగున ఉన్న దళిత ముస్లిం సమాజాంపై ప్రభుత్వ వైఖరిపై అప్నాదళ్(కే) నాయకురాలు పల్లవి పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయని ఆరోపించారు. పీడీఎం ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ ఉద్యమంతో ముందుకు వచ్చిందని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోక్‌సభ స్థానాల్లో అరంగ్రేటం చేయడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 జరిగే 7 దశల ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని 80 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story