Congress President Elections : అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారు : అశోక్ గెహ్లాట్

Congress President Elections : కాంగ్రెస్‌ని బలోపేతం చేసే సామర్థ్యం మల్లికార్జున ఖర్గేకు ఉందన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారన్నారాయన. పోటీలో ఉన్న మరో నేత శశిథరూర్‌ను 'ఉన్నత వర్గానికి' చెందిన వ్యక్తిగా గెహ్లాట్ అభివర్ణించారు. ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని.... ఆయన దళిత వర్గం నుంచి వచ్చిన నేత అన్నారు అశోక్ గెహ్లాట్. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కావాల్సిన అనుభవం ఖర్గేకు ఉందన్నారు. ఈ విషయంలో థరూర్‌ను ఖర్గేతో పోల్చలేమని.... అందువల్ల సహజంగానే పోటీ ఖర్గే వైపు ఏకపక్షంగా జరుగుతుందన్నారు గెహ్లాట్.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ మాత్రమే మిగిలారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఝార్ఖండ్ మాజీ మంత్రి కె.ఎన్.త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8 వరకు గడువు ఉంది. అప్పటిలోగా ఉపసంహరణలేమీ లేకపోతే 17న పోలింగ్ జరుగుతుంది.
మరోవైపు రాజ్యసభ విపక్ష నేత పదవికి రాజీనామా చేశారు మల్లికార్జున ఖర్గే. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే తీర్మానంలో భాగంగా ఈ మేరకు లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. ఈ పదవిని సీనియర్ నేతలు పి.చిదంబరం, లేదా దిగ్విజయ్‌సింగ్‌కు పార్టీ అప్పగించే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com