Gyanvapi mosque: జ్ఞానవాపిలో పురావస్తు శాఖ సర్వే షురూ....

ఉత్తరప్రదేశ్ వారణాసి (Varanasi)లో కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి (Gyanvapi) మసీదు (Mosque)లో శాస్త్రీయ సర్వేపై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీలక తీర్పు వెలువరించింది. మసీదులో భారత పురావస్తు శాఖ (Archaeological Survey of India) సర్వేకు అలహాబాద్ హైకోర్టు పచ్చజెండా ఊపింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేను వెంటనే ప్రారంభించవచ్చని ధర్మాసనం తెలిపింది. వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. న్యాయ ప్రయోజనాల కోసం శాస్త్రీయ సర్వే చేపట్టడం అవసరమని తీర్పు వెలువరిస్తూ కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పుతో పురావస్తు శాఖ సర్వే ప్రారంభించింది. పటిష్ట బందోబస్తు మధ్య పురావస్తు శాఖ అధికారులు సర్వే చేపట్టారు.
జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి జిల్లా (Varanasi Court) కోర్టు జులై 21న తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జులై 24న సర్వే ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది.
ఈ నేపథ్యంలోనే వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఏఎస్‌ఐ సర్వేపై స్టే విధించి తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తక్షణమే సర్వే ప్రారంభించేందుకు ASIకి అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖ బృందం సర్వే ప్రారంభించింది.
మొగల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో ఈ మసీదు నిర్మించారని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని(ASI) ఆదేశించింది. ఇప్పుడు ఈ ఉత్తర్వులను హైకోర్టు కూడా సమర్థించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com