Nitish Kumar: నితీష్ కుమార్ ఇంటి దగ్గర ఉద్రిక్తత..

బీహార్‌లో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇక ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టికెట్లు రాని ఆశావాహులు ఆందోళనకు దిగారు. నితీష్ కుమార్ నివాసం వెలుపల జేడీయూ నేత, గోపాల్‌పూర్ శాసనసభ్యుడు గోపాల్ మండల్ ధర్నా చేపట్టారు. తనకు టికెట్ కేటాయించేంత వరకు కదిలేదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.
బీజేపీ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌ల ఎన్డీయే కూటమి సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలో పోటీ చేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు దక్కాయి. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) చెరో ఆరు సీట్లలో పోటీ చేయనున్నాయి. 2020 బీహార్ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 110 సీట్లలో పోటీ చేసింది.
243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. మరోవైపు మహాఘటబంధన్(ఆర్జేడీ- కాంగ్రెస్- వామపక్షాలు)ల కూటమిలో ఇంకా సీట్ల లెక్కలు పూర్తి కాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com