Assam: బహు భార్యత్వం నిషేధం బిల్లుకు అసోం అసెంబ్లీ ఆమోదం

Assam: బహు భార్యత్వం నిషేధం బిల్లుకు అసోం అసెంబ్లీ ఆమోదం
X
హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలతోపాటు ఇతర అన్ని వర్గాలకు వర్తించేలా

బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ అసోం అసెంబ్లీ గురువారం ఒక బిల్లును ఆమోదించింది. ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహమాడిన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇందుకు కొన్ని మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, రాష్ట్రంలో ఆరో షెడ్యూల్‌ అమల్లో ఉన్న గిరిజన ప్రాంతాలకు ఇది వర్తించదని తెలిపింది.

అసోం ప్రొహిబిషన్‌ ఆఫ్‌ పాలిగమీ బిల్లు–2025ను గురువారం హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రవేశపెట్టారు. ఇందులో మతంతో సంబంధం లేదని, ఇస్లాంకు వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలతోపాటు ఇతర అన్ని వర్గాలకు ఇది వర్తిస్తుందన్నారు. ఈ బిల్లున ఉమ్మడి పౌర స్మృతి దిశగా పడిన ముందడుగుగా అభివర్ణించారు.

మన దేశంలో ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉండటం చట్టరీత్యా నేరం. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఇందుకు అనుమతి లేదు. అలానే ఇటు ఇండియన్ పీనల్ కోడ్‌ కూడా దీన్ని నేరంగానే పరిగణిస్తారు. ఒకసారి పెళ్లైన వ్యక్తి.. దాన్ని కాదని మరో మహిళను పెళ్లి చేసుకోవడం నేరం. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా హిందూ వివాహ చట్టం పరిధిలోకే వస్తారు.

ఇండియన్ పీనల్‌లోని సెక్షన్ 494,సెక్షన్ 495 ప్రకారం రాష్ట్రంలో బహుభార్యత్వం శిక్షార్హమైన నేరం. అయితే...ముస్లిం చట్టంలో మాత్రం వివాహానికి సంబంధించిన నియమాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి నలుగురు మహిళలను పెళ్లి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. అలానే ఆడవాళ్లందరికీ సమాన హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి అస్సాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముస్లిం వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.


Tags

Next Story