Assam : ఏసీఎస్‌ అధికారిణి ఇంట్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం

Assam : ఏసీఎస్‌ అధికారిణి ఇంట్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం
X
పోలీసులకు చిక్కిన అవినీతి తిమింగలం..

అస్సాంలో ఓ మహిళా ఆఫీసర్ కోట్లకు పడగలెత్తింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా అవినీతికి తెరలేపింది. తక్కువ కాలంలోనే కోట్లు వెనకేసుకుంది. అధికారులు జరిపిన సోదాల్లో కోట్లలో నగదు దొరకడంతో సివిల్ సర్వీస్ అధికారి నుపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.

నుపుర్ బోరా.. సివిల్ సర్వీస్ అధికారి. గోలాఘాట్‌లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం కమ్రూప్‌లో సర్కిల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 2019లో అస్సాం సివిల్ సర్వీసులో చేరారు. అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు ఆమె ఇంటిపై నిఘా ఉంచి సోదాలు నిర్వహించారు. దీంతో ఆమె ఇంట్లో రూ.500 నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు రూ.2 కోట్ల నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ముఖ్యమంత్రి స్పెషల్ విజిలెన్స్ సెల్ అధికారుల బృందం.. అధికారిణి నుపుర్ బోరా నివాసంపై దాడి చేశారు. రూ.92 లక్షల నగదు, భారీగా ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక బార్పేటలోని అద్దె ఇంట్లో జరిగిన దాడిలో రూ.10 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.2 కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద భూములను మార్పిడి చేస్తున్నట్లుగా ఆరోపణల నేపథ్యంలో గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. అలాగే ఒక హిందూ భూమిని అనుమానాస్పద వ్యక్తులకు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇక నుపుర్ బోరా సహాయకుడు లాట్ మండల్ సూరజిత్ కూడా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. అనేక ఆస్తులను సంపాదించినట్లుగా కనిపెట్టారు. అతడిని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధపడుతున్నారు.

Tags

Next Story