అస్సాంలో వరద బీభత్సం

అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో అస్సాం అతలాకుతలమవుతోంది. పలు జిల్లాల్లో గ్రామాలు నీట మునిగి...... చాలా మంది తాత్కాలిక శిబిరాల్లో, రోడ్ల మీదే కాలం వెళ్లదీస్తున్నారు. 19 జిల్లాల్లో దాదాపు 4 లక్షల 89 వేలమంది వరద ధాటికి ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. అస్సాంలో వరద బీభత్సంబజలి జిల్లాలోనే దాదాపు 2.67 లక్షల మంది వరద వల్ల ప్రభావితమయ్యారు. నల్బరిలో 80 వేల 61 మంది, బార్‌పేటలో 73 వేల 233 మంది, లఖింపూర్‌లో 22 వేల 577 మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అస్సాం అధికారులు వెల్లడించారు. వరద ధాటికి పంట నష్టం కూడా భారీగా సంభవించినట్లు వివరించారు. వరదల కారణంగా 10 వేల 782 హెక్టార్లలో పంట నీటమునిగిందని తెలిపారు. నల్బరీ జిల్లాలో వరద నీటిలో మునిగి ఒకరు మరణించగా.. ఇప్పటివరకూ వరద ధాటికి మరణించిన వారి సంఖ్య రెండుకు చేరింది. 54 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 15 వందల38 గ్రామాలు వరద ధాటికి ప్రభావితమవ్వగా... బ్రహ్మపుత్ర సహా ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావిత జిల్లాల్లో 140 సహాయ శిబిరాలను ఏర్పాటు చేయగా.. అందులో 35 వేల మందికిపైగా ఆశ్రయం పొందుతున్నారు. 4 లక్షల 30 వేలకుపైగా పెంపుడు జంతువులు కూడా వరద వల్ల గల్లంతైనట్లు అస్సాం విపత్తు బృందాల సమర్పించిన నివేదిక పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com