Assam Floods : అస్సాంలో వరద విలయం.. 70 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఛార్‌ధామ్‌ యాత్ర వాయిదా

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతుంది. నదులు ఉప్పొంగుతున్నాయి. బ్రహ్మపుత్ర నది.. దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అస్సాంలోని 30 జిల్లాల్లో భారీ వరదల కారణంగా 24లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 70 మంది మరణించారు. వందకుపైగా వణ్యప్రాణులు మృతిచెందగా.. 15.50లక్షల ప్రాణులపై వరద ప్రభావం పడింది. వరదలతో 125 రోడ్లు దెబ్బతినగా.. పలు వంతెనలుసైతం దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 577 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి..55వేల మందిని శిబిరాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, ఆహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుంది.

అడవి ఏనుగులు వరదల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఎత్తైన ప్రదేశాలను వెతుకుతూ జాతీయ రహదారిని దాటి కర్బీ అంగ్లాంగ్ కొండల వైపు వెళ్తున్నాయి. ఏనుగులే కాదు, అస్సాం గౌరవ్ ఒంటి కొమ్ము ఖడ్గమృగం కూడా ఎత్తైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ జాతీయ రహదారి 37పై తిరుగుతూ కనిపించింది. కజిరంగా నేషనల్ పార్క్‌లో మరణించిన 125 జంతువులలో 6 ఒక కొమ్ము గల ఖడ్గమృగం, 90 జింకలు, ఇతర జంతువులు ఉన్నాయి. అటవీ శాఖ 96 జంతువులను రక్షించింది.

ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం రిషికేశ్‌లోని త్రివేణి ఘాట్, గంగా హారతి ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారింది. దీంతో రాత్రివేళల్లో ఘాట్‌ల వద్దకు పర్యాటకులెవరూ వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన దళం హెచ్చరికలు జారీ చేసింది. గఢ్‌వాల్‌ ప్రాంతంలో 7, 8 తేదీల్లో (ఆదివారం, సోమవారం) భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేయడంతో తాత్కాలికంగా చార్‌ధామ్‌ యాత్రను ఆదివారం నిలిపివేశారు. కొండచరియలు విరిగి రోడ్డుపై పడుతుండడంతో బద్రీనాథ్‌కు వెళ్లే మార్గంలో ఆటంకాలు ఏర్పడ్డాయి.

Tags

Next Story