Assam: స్థానిక ప్రజలకు ఆయుధాలు ఇవ్వనున్న అస్సాం ప్రభుత్వం..

అస్సాంలో స్థానిక ప్రజలు, భారతీయులకు ఆయుధాలు ఇచ్చేందుకు అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఒక పోర్టల్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తెలిపారు. ఆక్రమిత అటవీ, చిత్తడి నేలల నుంచి అక్రమ స్థిర నివాసులు, ఆక్రమణదారులు, ఎక్కువగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను తరిమికొట్టడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.
‘‘ఆయుధ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఒక పోర్టల్ ఉంటుంది. ఆగస్టు 1-7 మధ్య ప్రారంభం అవుతుంది. డిప్యూటీ కమిషనర్ విచారణ నిర్వహిస్తారు. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వారికి ఆయుధ లైసెన్స్ మంజూరు అవుతుంది’’ అని హిమంత ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. పోర్టల్ ప్రారంభించిన తర్వాత ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరని, పోర్టల్ లేకపోయినా ఫిజికల్‌గా పత్రాలను సమర్పించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎలాంటి పరిమితులు లేవని వెల్లడించారు.
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల ఆక్రమణపై జూలై 21న హిమంత మాట్లాడుతూ.. జనాభాలో మార్పులను నియంత్రించకపోతే స్థానిక అస్సామీలు, హిందువులు 10 ఏళ్లలో రాష్ట్రంలో మైనారిటీలుగా మారుతారని ఆయన చెప్పారు. అక్రమ వలసదారుల నుంచి భూమిని విడిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇప్పటికే 18 లక్షల ఎకరాల భూమి ఆక్రమణదారుల కింద ఉందని చెప్పారు.
అయితే, సరిహద్దు, మారుమూల ప్రాంతాల్లో నివసించే స్థానిక భారత ప్రజలకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్నయాన్ని అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై మే నెలలో నిర్ణయం తీసుకుంది. అస్సాం ప్రజలకు తుపాకులు కాదని, నీరు, ఉపాధి, విద్య, వైద్య సౌకర్యాలను కోరుకుంటున్నారని ఆయన మే నెలలో అన్నారు. రాష్ట్రంలోని ధుబ్రి, నాగావ్, మోరిగావ్, బార్పెట,ర సౌత్ సల్మారా, గోల్‌పారా జిల్లాల్లోని ప్రజలకు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com