భార్యకు లోక్‌సభ టికెట్ ఇవ్వలేదని పార్టీ మార్చేసిన ఎమ్మెల్యే..

భార్యకు లోక్‌సభ టికెట్ ఇవ్వలేదని పార్టీ మార్చేసిన ఎమ్మెల్యే..
అసోంలోని లఖింపూర్ జిల్లాలోని నవోబోయిచా ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా, తన భార్యకు లోక్‌సభ ఎన్నికలకు పార్టీ నుండి టికెట్ ఆశించాడు.

అసోంలోని లఖింపూర్ జిల్లాలోని నవోబోయిచా ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా, తన భార్యకు లోక్‌సభ ఎన్నికలకు పార్టీ నుండి టికెట్ ఆశించాడు. కానీ హైకమాండ్ అతడి ఆశలకు అడ్డుకట్ట వేసింది. దాంతో ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

లఖింపూర్ లోక్‌సభ స్థానానికి ఉదయ్ శంకర్ హజారికాను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి అయిన తన భార్య రాణీ నారాను ఈ సీటుకు నామినేట్ చేస్తుందని నారా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.. కానీ అతని ఆశలు అడియాసలయ్యాయి.

"నేను తక్షణమే భారత జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నాను" అని ఎమ్మెల్యే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తన వన్‌లైన్ రాజీనామా లేఖను సమర్పించారు.

ఆదివారం, అస్సాం కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ పదవికి నారా రాజీనామా చేశారు.

అతను ఢకుఖానా నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021లో నవోబోయిచా నుండి ఆరవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు అతడు అసోమ్ గణ పరిషత్ (AGP)లో ఉన్నారు.

నారా AGP మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయన అప్పటి ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌కి పత్రికా సలహాదారుగా కూడా పని చేశారు.

అతని భార్య రాణీ నారా మూడుసార్లు లఖింపూర్ నుండి ఎంపీగా పనిచేశారు. రాజ్యసభకు కూడా ఒక పర్యాయం పనిచేశారు.

కొన్ని నెలల క్రితం అధికార బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన హజారికా లఖింపూర్ నుంచి నామినేషన్ కోసం గట్టి పోటీలో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

హజారికా పార్టీలో కొత్త వ్యక్తి అయినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా నుండి అతనికి బలమైన మద్దతు ఉందని వారు చెప్పారు. నియోజక వర్గంలో వరుసగా మూడోసారి పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ అభ్యర్థి ప్రదాన్ బారుహ్‌తో హజారికా నేరుగా పోటీ చేస్తున్నారు.

ఈ నెల ప్రారంభంలో, కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ తనకు బార్పేట నియోజకవర్గం నుండి టికెట్ నిరాకరించడంతో పార్టీకి రాజీనామా చేశారు. అయితే, న్యూఢిల్లీలో ఖర్గేతో భేటీ అనంతరం ఆయన దానిని ఉపసంహరించుకున్నారు.

14 లోక్‌సభ స్థానాలకు గాను 13 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇది మిత్రపక్షమైన అస్సాం జాతీయ పరిషత్ (AJP)కి దిబ్రూఘర్ సీటులో మద్దతు ఇచ్చింది.

బీజేపీ 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, దాని మిత్రపక్షాలైన ఏజీపీ, యూపీపీఎల్ వరుసగా రెండు, ఒక స్థానంలో అభ్యర్థులను నిలబెట్టాయి. లోక్‌సభలో రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు ముగ్గురు ఎంపీలు ఉండగా, బీజేపీకి తొమ్మిది, ఒక సీటు ఏఐయూడీఎఫ్, ఒకటి ఇండిపెండెంట్ చేతిలో ఉంది.

ప్రస్తుతం, 126 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపి అధికారిక బలం 61 కాగా, దాని మిత్రపక్షాలైన ఎజిపి మరియు యుపిపిఎల్‌లకు వరుసగా తొమ్మిది మరియు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

ప్రతిపక్ష బెంచ్‌లలో కాంగ్రెస్‌కు 27 మంది ఎమ్మెల్యేలు, ఏఐయూడీఎఫ్‌కు 15 మంది, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)కు ముగ్గురు, సీపీఐ(ఎం)కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఒక స్వతంత్ర శాసనసభ్యుడు కూడా ఉన్నారు.

Tags

Next Story