Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఆధిక్యంలో బీజేపీ
మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఆ పార్టీ ఆధిక్యంలో సాగుతోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 నియోజకవర్గాలు ఉండగా 160కిపైగా స్థానాల్లో కమలం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈసారి తమదే అధికారమన్న కాంగ్రెస్ అంచనాలు దారుణంగా తలకిందులయ్యాయి. కేవలం 60కిపైగా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బుధ్నీలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్....తన కంచుకోట అయిన చింద్వారాలో ఆధిక్యంలో ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లోని 230స్థానాలకు గతనెల 17న పోలింగ్ జరగ్గా 77.82శాతం ఓటింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 75.63శాతం ఓటింగ్ నమోదైంది. 116 సీట్లు గెలిచిన పార్టీ....మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 2018ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 116స్థానాలు, భాజపా 109 సీట్లు గెలుపొందాయి. కమల‌్ నాథ్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ దాదాపు ఏడాదిన్నర తర్వాత జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తిరగుబాటు చేయటంతో ప్రభుత్వం పడిపోయింది. శివరాజ్‌సింగ్ సారథ్యంలో మళ్లీ భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది.
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఉత్తరాదిన మూడు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిక్యంలో దూసుకుపోతోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ముందంజలో ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి వెలువడ్డ ఫలితాల ప్రకారం 230 అసెంబ్లీ స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్‌లో బీజేపీ 160 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 69 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో 199 స్థానాలకు ఎన్నికలు జరుగగా బీజేపీ 114 స్థానాలలో ఆధిక్యం దక్కించుకోగా కాంగ్రెస్ 71 స్థానాలలో ముందంజలో ఉంది. 90 స్థానాలు కలిగిన ఛత్తీస్‌గఢ్‌లో 53 స్థానాలలో ముందంజలో ఉండగా కాంగ్రెస్ 35 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
మధ్యప్రదేశ్‌లో 52జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2,533 మంది అభ్యర్థులు పోటీలో దిగగా ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకూ వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. మరి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు చూపించాయి. రెండో సారి కూడా తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com