Assembly Elections 2022: 2024కు సెమీ ఫైనల్స్‌గా ఐదు రాష్ట్రాల ఎన్నికలు

Assembly Elections 2022: 2024కు సెమీ ఫైనల్స్‌గా ఐదు రాష్ట్రాల ఎన్నికలు
Assembly Elections 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలు 2024 గ్రాండ్‌ ఎలక్షన్స్‌ను డిసైడ్ చేయబోతున్నాయి.

Assembly Elections 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలు 2024 గ్రాండ్‌ ఎలక్షన్స్‌ను డిసైడ్ చేయబోతున్నాయి. గెలుపు ఓటములను బట్టి కొత్త నాయకులు, రాజకీయ వారసులు పుట్టుకురాబోతున్నారు. ఉన్న పార్టీలే మరింత పాతుకుపోవడమా, కొత్త కూటమి పుట్టుకురావడమా అనేది తేలిపోతుంది. ఇన్ని అంశాలతో ముడిపడి ఉంది కాబట్టే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్ ఫైట్‌తో పోల్చుతున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం బీజేపీకి చాలా ముఖ్యం. పార్లమెంట్‌ స్థానాల పరంగానూ అతిపెద్ద రాష్ట్రం అదే. బీజేపీ గెలిచిన 301 లోక్‌సభ స్థానాల్లో 62 యూపీ నుంచే వచ్చాయి. ఇక్కడ గానీ మళ్లీ గెలవగలిగితే.. 2024కి లైన్‌ క్లియర్ అయినట్టే. ఛాతిని వెడల్పు చేసుకుని బరిలో దిగొచ్చు. అక్కడితోనే రాజకీయ మార్పు ఆగదు.

యోగి ఆదిత్యనాథ్ హీరోగా మారొచ్చు. మోదీకి ప్రత్యామ్నాయంగా మారి, తదుపరి ప్రధాని యోగీనే అనే క్యాంపైన్‌ జరిగినా జరగొచ్చు. ఒక్క యూపీలో గెలుపు బీజేపీలోనే ఇన్ని మార్పులు తీసుకురావొచ్చు. బీజేపీకి యూపీ ఎలాగో, కాంగ్రెస్‌కి పంజాబ్‌ అలాగ. పంజాబ్‌ పీఠం దక్కించుకోవడం కాంగ్రెస్‌కు అత్యవసరం. అక్కడగాని ఓడిందంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీని దెబ్బపడ్డట్టే. అసలే ఆప్‌ దూసుకొస్తోంది. రిపోర్టులన్నీ కేజ్రీవాల్‌ హవానే కొనసాగవచ్చని చెబుతున్నాయి.

మరోవైపు బీజేపీ-అమరీందర్‌ సింగ్‌ పార్టీ ఉండనే ఉంది. ఈ త్రిముఖ వ్యూహంలో కాంగ్రెస్‌ గట్టెక్కడం అంటే సవాల్ అనే చెప్పొచ్చు. ఒకవేళ పంజాబ్‌లో గనక జెండా ఎగరేస్తే.. కాంగ్రెస్‌కు ఎక్కడలేని శక్తి వస్తుంది. కాంగ్రెస్సేతర థర్డ్‌ ఫ్రంట్‌ అని ముందుకొస్తున్న వాళ్లకు.. కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్లక తప్పదేమోనన్న పరిస్థితులు రావొచ్చు.

కేంద్రంలో బీజేపీని దెబ్బ కొట్టడానికి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడాలనుకుంటున్నాయి. ఇందులో ఇప్పటివరకైతే కాంగ్రెస్‌కు స్థానం లేదు. పంజాబ్‌లో పాగా వేస్తేనైనా కూటమిలోకి కాంగ్రెస్‌ ఎంట్రీ ఇవ్వొచ్చు. ఇక నాయకుడు లేని జాతీయ పార్టీగా మిగిలిన కాంగ్రెస్‌కు ప్రియాంకగాంధీ రూపంలో కొత్త నాయకత్వం దొరకొచ్చు.

పంజాబ్‌లో నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూను వెనకుండి నడిపిస్తున్నది ప్రియాంక గాంధీనే. పీసీసీ చీఫ్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టడానికి ప్రియాంకనే కారణం. మరోవైపు యూపీలో కాంగ్రెస్‌ ఏమాత్రం ప్రభావం చూపించినా.. కాంగ్రెస్‌ పార్టీకి ప్రియాంకగాంధీ రూపంలో కొత్త లీడర్‌ దొరికినట్టే. ప్రాంతీయ పార్టీలకు సైతం ఈ ఎన్నికలు అగ్ని పరీక్షే. ఢిల్లీ సరిహద్దు దాటాలని ఆమ్‌ఆద్మీ, బెంగాల్‌ నుంచి ఢిల్లీ పీఠం వరకు రావాలని తృణమూల్‌ వ్యూహాలు రచిస్తున్నాయి.

కొత్త ఫ్రంట్‌ కోసం మమత చేస్తున్న ప్రయత్నాలు మరింత ముందుకు వెళ్లాలంటే.. గోవాలో బీజేపీని గట్టిగా ఢీకొట్టాల్సిందే. గోవాలో అధికారం చేజిక్కించుకోవాలంటే క్యాథలిక్‌ ఓట్లు చాలా ముఖ్యం. వారి ఓట్ల కోసమే వాటికన్ సిటీకి వెళ్లి మరీ పోప్‌ను ఇండియాకు ఆహ్వానించారు మోదీ. ఈ మంత్రం బీజేపీకి ఏమాత్రం ఓట్లు తెచ్చిపెడుతుందో చూడాలి.

ఇప్పటికే, ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి గోవాలో కాలుపెట్టారు మమత. మరోవైపు గోవాలో ఆమ్‌ఆద్మీ పార్టీ సైతం పోటీపడుతోంది. చిన్న రాష్ట్రమే అయినా.. ఇక్కడ గెలిస్తే దక్షిణాదిలో అడుగుపెట్టినట్టవుతుంది. ఉత్తరాది పార్టీలుగా గుర్తింపు ఉన్న ఆప్, తృణమూల్‌కు గోవా విజయం గొప్ప బలాన్ని ఇవ్వొచ్చు. అంతేకాదు, ఢిల్లీ పీఠాన్ని ఢీకొట్టేందుకు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయనే సంకేతాలు ఇవ్వొచ్చు.

ఇప్పటి వరకు కాంగ్రెస్‌నే ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న బీజేపీకి.. ఇకపై పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు అతి పెద్ద సవాలుగా మారొచ్చు. ఇక సమాజ్‌వాదీపార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. యూపీలో రెండు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలను ఢీకొడుతున్నది ఎస్పీనే. అఖిలేశ్‌ దూకుడు కూడా మామూలుగా లేదు.

రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్నప్పటికీ.. బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలను సమాజ్‌వాదీ పార్టీలోకి ఆకర్షించగలుగుతున్నారంటే.. అఖిలేశ్ మాయాజాలం ఎంతో కొంత పనిచేస్తోందనే అర్ధం. ఓవైపు అయోధ్య పునర్నిర్మాణం, మరోవైపు కాశీ అభివృద్ధి వంటి బలమైన అంశాలు ఉన్నప్పటికీ.. అఖిలేశ్‌తో ఢీ అంటే ఢీ అంటూ కొట్లాడాల్సి వస్తోంది.

యూపీలో అఖిలేశ్‌ గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించినట్టే. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎప్పటికీ ఉంటాయని, భవిష్యత్తులో కూటమి కట్టగలవని నిరూపితం అవుతుంది. మరోవైపు మాయావతి, లాలూ ప్రసాద్‌ యాదవ్ వారసత్వానికి కూడా ఈ ఎన్నికలు పరీక్ష పెట్టబోతున్నాయి. దళితులు, అగ్రవర్ణాలు అనే డిఫరెంట్‌ కాంబినేషన్‌తో యూపీని ఏలిన మాయావతి.. ఈసారి ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు.

తేజస్వియాదవ్‌ ఆర్జేడీని పరిగెత్తిస్తున్నప్పటికీ.. బీజేపీ, ఎస్పీని ఓవర్‌టేక్‌ చేయడానికి ఆ జోరు సరిపోతుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. వివిధ సామాజికవర్గాలు ఎవరివైపు ఉంటారన్నది కూడా ఈ ఎన్నికలతో తేలిపోతుంది. యూపీలో దళితులను దగ్గరకు చేర్చుకోవడంలో కొంత సక్సెస్‌ అయింది బీజేపీ. ఈ విషయంలో దళితులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న బీఎస్పీ బాగా వెనకబడిపోయింది.

అయోధ్య, కాశీ వంటి టెంపుల్‌ పాలిటిక్స్‌ కారణంగా మైనారిటీ ఓటర్లు ఎస్పీ వైపు చూస్తున్నారు. బీసీల ఐక్యత పేరుతో అఖిలేశ్‌ వేస్తున్న ఎత్తులు కూడా సమాజ్‌వాదీ పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇక పంజాబ్‌లో మైనారిటీ వర్గం ఓట్లు చాలా ముఖ్యం. ఇప్పటివరకైతే ఆ ఓటర్లంతా కాంగ్రెస్‌ వైపే ఉన్నారు. పైగా ప్రతి నియోజకవర్గంలోనూ మైనారిటీ ఓట్‌ షేర్‌ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉండడంతో.. బీజేపీ మానియా ఇక పనిచేయడం లేదు.

పోనీ, రైతుల కోణంలోనైనా ఓట్లు కొల్లగొట్టాలనుకుందాం అనుకుంటే.. ఏకంగా ప్రధానికే బ్రేకులు వేశారు పంజాబ్‌ రైతులు. సిక్కులను మచ్చిక చేసుకోడానికి కర్తార్‌పూర్‌ ఫార్ములాను ప్రయోగించినా.. బీజేపీకి ఏమాత్రం కలిసి వస్తుందనేది ప్రశ్నార్ధకమే. పైగా పంజాబ్‌లో దళితుడైన చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. దీంతో దళిత ఓటర్లు కాంగ్రెస్‌ వైపే ఉంటారన్న సంకేతం పంపించారు. మొత్తానికి ఏ సామాజికవర్గం ఏ పార్టీని గెలిపిస్తుందన్నది ఈ ఎన్నికలతో తేలిపోనుంది.

Tags

Read MoreRead Less
Next Story