Assembly polls 2023 : కొనసాగుతున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. ఛత్తీస్ గడ్ లో రెండో విడతలో భాగంగా 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఛత్తీస్ గడ్ లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న మధ్యప్రదేశ్‌లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని.. అందరూ తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, అంబికాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి టీఎస్ సింగ్ డియో రాజమోహినీ దేవి బాలికల కళాశాలలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. బీజేపీ ఎంపీ సరోజ్ పాండే దుర్గ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. మరోవైపు భింద్‌లోని మెహగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మన్హద్ గ్రామంలో పోలింగ్ కేంద్రం బయట రాళ్ల దాడి జరిగింది. బీజేపీ అభ్యర్థి రాకేష్ శుక్లాకు ఈ ఘటనలో స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ కోసం 18,800 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 70 స్థానాల్లో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో ఒకే దశలో పోలింగ్ జరుగుతుండగా, ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరిగింది.
గడిచిన రెండు దశాబ్దాల్లో దాదాపు 18 ఏళ్లు మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. దాదాపు 42,000 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను అందుబాటులో ఉంచారు. ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలు, రాష్ట్రంలోని 2 లక్షల మంది పోలీసులను భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. 2,500 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. దాదాపు 5.59 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 2.87 కోట్ల మంది పురుషులు, 2.71 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. లోక్‌సభ ఎన్నికలకు దాదాపు ఆరు నెలల ముందు జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌లకు కీలకం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com