PM Modi: త్వరలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రధాని మోదీ

కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలయ్యాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. త్వరలోనే జమ్ముకశ్మీర్ తిరిగి రాష్ట్ర హోదా పొందనున్నదని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ గురువారం శ్రీనగర్‌లో రూ.1500 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రదాడులను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తుందని, తగిన సమయంలో శత్రువులకు ధీటుగా సమాధానం ఇస్తామన్నారు. కశ్మీర్ లోయలో శాంతి, అభివృద్ధికి విఘాతం కలిగించేందుకు కొన్ని శక్తులు చేస్తున్న ప్రయత్నాలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్య విజయం సాధించారని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో 370వ ఆర్టికల్ అడ్డుగోడ తొలగిపోయి అందరికీ రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయని అన్నారు.
2019లో ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది. అప్పటి నుంచి అక్కడ ప్రజలు రాష్ట్ర హోదాను కోరుతున్నారు. పలు సందర్భాల్లో అమిత్ షా రాష్ట్రహోదాపై వాగ్దానం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభయ్యాయి. చివరిసారిగా 2014లో రాష్ట్రంగా ఉన్న సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగాయి. సుప్రీంకోర్టు ఎన్నికలకు సెప్టెంబర్ గడువు విధించడంతో ఎన్నికల సన్నాహాలు వేగవంతమయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com