Delhi: మరోసారి ఆప్ వర్సెస్ కేంద్రం.. బలవంతంగా తరలించారన్న సీఎంవో
దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి సామగ్రిని ఆమె అధికార నివాసం నుంచి తొలగించారు. పలు వాహనాల్లో ఆ ఇంటి నుంచి పంపివేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశం మేరకు అధికారులు ఈ చర్యకు పాల్పడినట్లు సీఎంవో కార్యాలయం, ఆప్ నేతలు ఆరోపించారు. ఆప్ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖాళీ చేసిన ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ 6లోని అధికార నివాసంలోకి ఢిల్లీ సీఎం అతిషి సోమవారం మారారు. అయితే బుధవారం సీఎం అధికార నివాసం నుంచి అతిషికి సంబంధించిన లగేజ్‌ను పీడబ్ల్యూడీ అధికారులు తొలగించారు. ఆ నివాసం మెయిన్ డోర్‌కు మరో లాక్ వేశారు. ఆ బంగ్లా తాళాలను కేజ్రీవాల్ అప్పగించలేదని ఆరోపించారు.
కాగా, ఈ చర్యపై సీఎం కార్యాలయం (సీఎంవో) స్పందించింది. ‘దేశ చరిత్రలో తొలిసారి ముఖ్యమంత్రి నివాసాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు. బీజేపీ పిలుపు మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశంతో సీఎం నివాసం నుంచి అతిషి వస్తువులను తొలగించారు’ అని సీఎంవో ఆరోపించింది. బీజేపీ ముఖ్య నేతకు ఆ బంగ్లా కేటాయించడం సీఎం అతిషిని బలవంతంగా ఖాళీ చేయించినట్లు ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.
మరోవైపు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఈ పరిణామంపై స్పందించారు. ఆ నివాసానికి ఎట్టకేలకు సీలు వేశారని అన్నారు. ‘ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ ‘షీష్ మహల్’కు సీల్ పడింది. సంబంధిత శాఖకు తాళాలు ఇవ్వకుండా మళ్లీ ఆ బంగ్లాలోకి అడుగుపెట్టేందుకు మీరు ప్రయత్నించారు. ఆ బంగ్లాలో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి? అని వీడియో సందేశంలో పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com