Saleem Wastik:'ఎక్స్-ముస్లిం' యూట్యూబర్ సలీం వాస్తిక్‌పై హత్యాయత్నం....నిందితుడు జీషన్ ఎన్‌కౌంటర్!

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన 'ఎక్స్-ముస్లిం' యూట్యూబర్ సలీమ్ వాస్తిక్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుల్లో ఒకడైన జీషన్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. ఘాజియాబాద్‌లోని లోనీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.
గత శుక్రవారం సలీమ్ తన కార్యాలయంలో ఉండగా బైక్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కత్తితో దాడి చేశారు. సలీమ్ మెడ, పొట్ట భాగంలో దాదాపు 10 సార్లు పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
ఈ క్రమంలో, నిందితుడు జీషన్ లోనీ ప్రాంతంలో ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసులను గమనించిన జీషన్ వారిపై కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం 10 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. సలీమ్ తన యూట్యూబ్ వీడియోలలో కొన్ని మతపరమైన పద్ధతులను విమర్శించినందుకే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
