Kalindi Express : కాళింది ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ రైలు మార్గంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టింది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాళింది ఎక్స్‌ప్రెస్ యూపీలోని ప్రయాగ్‌రాజ్ నుంచి కాన్పూర్ సెంట్రల్ మీదుగా హర్యానాలోని భివానీకి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శివరాజ్‌పూర్ ప్రాంతాంలో రైలు పట్టాలపై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన లోకోపైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ట్రెయిన్‌ను ఆపేశాడు. అప్పటికే రైలు సిలిండర్‌ను ఢీకొట్టడంతో అది పట్టాలకు సుమారు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. విచారణ అనంతరం ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఓపీ మీనా బృందం సిలిండర్‌ను స్వాధీనం చేసుకుంది. అలాగే సంఘటనా స్థలంలో ఒక పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టను కూడా గుర్తించారు. రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే వీటిని ట్రాక్‌పై పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, రైలును కొద్దిసేపు నిలిపివేసిన అధికారులు.. ఆ మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ముందుకు వెళ్లేందుకు అనుమతించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com