Avani Dias: మోడీ సర్కార్ పై ఆస్ట్రేలియా జర్నలిస్ట్ హాట్ కామెంట్స్

దేశంలో ఎన్నికల కవరేజీ కోసం ఆస్ట్రేలియా జర్నలిస్ట్ అవనీ దియాస్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలను అధికారిక వర్గాలు ఖండించాయి. ఆ వార్తలన్నీ అవాస్తవాలని, తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశించినవని పేర్కొన్నాయి.
ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు (ఏబీసీ) చెందిన అవనీ దియాస్.. దక్షిణాసియా వ్యవహారాలపై రిపోర్టింగ్ చేస్తుంటారు. ఏప్రిల్ 20న దేశాన్ని వీడిన ఆమె పలు సంచలన ఆరోపణలు చేశారు. తన వీసా పునరుద్ధరణ జరగదన్న సమాచారం అందిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇటీవల యూట్యూబ్‌లో ఆమె చేసిన ఓ కార్యక్రమం హద్దు మీరిందని విదేశాంగ శాఖ అధికారి ఒకరు తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. అయితే, వృత్తికి సంబంధించిన వీసా నిబంధనలను దియాస్ ఉల్లంఘించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇంత జరిగినా కూడా ఎన్నికలపై రిపోర్టింగ్‌కు వీలుగా ఆమె వీసాను పొడిగించేందుకు హామీ ఇచ్చామని కూడా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె వీసా గడువు ఏప్రిల్ 20తో ముగుస్తుందని, ఏప్రిల్ 18న ఆమె వీసా ఫీజు చెల్లించడంతో జూన్ నెలాఖరు వరకు వీసా పొడిగించినట్టు తెలిపాయి. కానీ దియాస్ స్వయంగా ఏప్రిల్ 20నే దేశం విడిచివెళ్లారని పేర్కొన్నాయి.
‘‘ఇండియా వదిలి వెళ్లే సమయంలో ఆమె వద్ద చెల్లుబాటయ్యే వీసా ఉంది. ఎన్నికల కవరేజీకి అనుమతివ్వలేదన్న ఆరోపణలు వాస్తవం కాదు. జర్నలిస్టు వీసా ఉన్న వాళ్లందరికీ పోలింగ్ బూత్‌ల బయట కార్యకలాపాలపై రిపోర్ట్ చేసేందుకు అనుమతి ఉంది. పోలింగ్ బూత్‌లో, కౌంటింగ్ సెంటర్ల లోపలికి వెళ్లేందుకు మాత్రం అనుమతులు అవసరం. అయితే వీసా పొడిగింపు దరఖాస్తు పరిశీలనలో ఉన్నప్పుడు ఈ అనుమతులు ఇవ్వలేము. మరో విషయం ఏంటంటే ఇతర ఏబీసీ రిపోర్టర్లు మేఘ్నా బాలీ, సోమ్ పాటీదార్‌లకు లేఖలు అందాయి’’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com