Ayodhya Deepotsav : దేదీప్యమానం.. అయోధ్యా నగరం

సరయూ నదీ తీరంలో ఒకేసారి 22 లక్షలకుపైగా దీపాలను వెలిగించి అయోధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. గతేడాది 15 లక్షల దీపాలు వెలిగించి తాను నెలకొల్పిన రికార్డును ఈ ఏడాది అయోధ్య బద్దలు కొట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆయోధ్యలో సరయూ నదీ తీరనా గత ఏడేళ్లుగా దీపావళికి ముందు రోజు దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సారి జరిగిన దీపోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది. శనివారం సాయంత్రం సరయూ తీరంలోని 51 ఘాట్‌లల్లో 22 లక్షల పైగా దీపాలను అందంగా అలంకరించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 25 వేల మందికిపైగా వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ దీపోత్సవం అమోఘమని, దైవీకమని, కళ్లలో చెరిగిపోనిదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేత్రపర్వమైన ఆ దీపోత్సవ దృశ్యాలను తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పంచుకున్నారు.
అయోధ్యలో వెలిగించిన లక్షలాది దీపాల వెలుగులో దేశమంతా కాంతులీనుతోందన్నారు. ‘ఈ దీప కాంతుల నుంచి వెలువడే శక్తి దేశమంతటా కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ శ్రీ రాముడు దేశ ప్రజలందరికీ సుభిక్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్’ అని ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు.
వనవాసాన్ని ముగించుకుని సీతాసమేతంగా అయెధ్యలో అడుగుపెట్టిన శ్రీ రామునికి, ఆయన సోదరులు భరత శతృఘ్నులు స్వాగతం పలికిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొన్నారు. అనంతరం నదీ తీరంలో యోగి ఆదిత్యనాథ్ సరయూ హారతి నిర్వహించి దీపోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల బృందం హాజరై డ్రోన్ కెమెరాతో వెలిగించిన దీపాలను లెక్కించారు. అనంతరం ప్రపంచ రికార్డును ధ్రువీకరిస్తూ ముఖ్యమంత్రికి సర్టిఫికేట్‌ను అందించారు.
సరయూ నదీ తీరంలో జరిగిన దీపోత్సవ్‌కు 54 దేశాలకు చెందిన రాయబారులు , ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీపోత్సవ్‌కు ముందు నిర్వహించిన రామాయణం, రామచరిత మానస్‌తో పాటు వివిధ సామాజిక అంశాల ఇతివృత్తంతో రూపొందించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసి లేజర్ షో సందర్శకులకు కనువిందు చేసింది.
అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం 22 లక్షల దీపాలతో అత్యంత వైభవంగా జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా తన గిన్నిస్ రికార్డును తానే బద్దలుకొట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com