AYODHYA: ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధమవుతున్న అయోధ్య

AYODHYA: ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధమవుతున్న అయోధ్య
అయోధ్యలో ప్రతిష్ఠించనున్న ఏడు ధ్వజస్థంభాలు సిద్ధం... భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..

అయోధ్యలో ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభం సిద్ధమైంది. ఆలయ ప్రాంగణంలో మొత్తం 7 ధ్వజ స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్‌లో తయారు చేయించిన ఈ ధ్వజస్తంభాలు.. అయోధ్యకు చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు కుంబాభిషేకం నిర్వహించే పాత్రలను వారణాసిలో శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు తయారు చేయిస్తోంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక దగ్గరపడుతున్న నేపథ్యంలో గుజరాత్‌లో ధ్వజస్తంభాల తయారీ కూడా పూర్తయింది. రామమందిరంలో ప్రధాన ధ్వజస్తంభంతో పాటు మొత్తం ఏడింటిని ఏర్పాటు చేయనున్నారు. ఇత్తడితో తయారు చేయించిన ఈ ధ్వజస్తంభాల బరువు 5వేల 500 కిలోలు. గుడికి కావాల్సిన ఇత్తడి సామాన్లన్నిటినీ అహ్మదాబాద్‌లోని ఈ కర్మాగారంలోనే తయారు చేయిస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. ఒక్కో ధ్వజస్తంభం 44 అడుగుల పొడవు, 9 ఇంచుల వైశాల్యం, ఒక ఇంచు మందంతో ఉంటుంది. శాస్త్రాల ప్రకారమే వీటి నిర్మాణం జరిగిందని తయారీదారులు తెలిపారు. ఈ ధ్వజస్తంభాలను త్వరలో అయోధ్యకు తరలించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


మరోవైపు రామమందిరంలో పూజలు, కైంకర్యాలు నిర్వహించడానికి ప్రత్యేక పాత్రలను వారణాసిలో ట్రస్టు సిద్ధం చేయిస్తోంది. వీటి తయారీ కుడా దాదాపు పూర్తి కావొచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిని కొనసాగిస్తున్న హస్తకళాకారులు వీటిని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం వీరు 22న జరిగే కుంభాభిషేకం కోసం ఝరీలు, అర్ఘీలు అనే పాత్రలు తయారు చేస్తున్నారు. వీటితో విగ్రహాలకు స్నానాది కార్యక్రమాలు చేస్తారని తయారీదారులు తెలిపారు. జనవరి 10 లోపు వీటి తయారీ పూర్తవుతుందని వెల్లడించారు.

అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో యాత్రికుల సౌకర్యార్థం చేపట్టిన వసతి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆలయానికి సమీపంలో టెంట్‌సిటీని అధికారులు సిద్ధం చేశారు. ఈ నెల 22న సాధువులు, ఇతర కీలక వ్యక్తులకు ముందుగా ఈ టెంట్‌సిటి విడిది క్షేత్రం కానుంది. ఈ టెంట్‌సిటీని తీర్థక్షేత్ర పురమని స్థానిక యంత్రాంగం వ్యవహరిస్తోంది. 45 ఎకరాల్లో ఈ ప్రాంతాన్ని సిద్ధం చేశారు. పూర్తిగా రేకులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాల్లో మొత్తంగా 1450 పడక గదులు ఉన్నాయి. వీటితో పాటు 500 డార్మిటరీలు ఉన్నాయి. 15వేల మందికి ఒక రోజు బస కల్పించేలా దీని నిర్మాణం జరిగింది. ప్రాణప్రతిష్ఠ రోజు సాధారణ భక్తులు రావద్దనీ ఇప్పటికే యూపీ ప్రభుత్వం కోరింది. ప్రారంభోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు భారీగా అయోధ్య తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ డేరా పట్టణాన్ని 30 రోజులు అలాగే ఉంచాలని నిర్ణయించారు. ఆహారాన్ని కూడా ఇక్కడే సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం టెంట్‌సిటీని 6 సెక్షన్లుగా విభజించి ఒక్కో సెక్షన్‌కు ఒక వంటగదిని సిద్ధం చేశారు. ఒక్కో సెక్షన్‌లో ఏకకాలంలో 2500 నుంచి 3వేల మంది వరకు భోజనం చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. అందరికీ ఉచితంగా భోజనం అందించనున్నట్లు వివరించారు. రామాయణ కథ, నాటకాల వంటి వినోద కార్యక్రమాలను కూడా అక్కడ నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story