Ayodhya Ram Temple: సౌర నగరంగా మారనున్న అయోధ్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామాలయం ప్రారంభ ముహూర్తానికి తొలి సౌర నగరంగా అయోధ్య అవతరించనుంది. యూపీ పునరుత్పాదక ఇంధన శాఖ ఈ పనులను యుద్ధప్రాతిపదికను చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయోధ్య నగరాన్నిఇటీవల పర్యవేక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్... సూర్యవంశానికి రాజధాని అయోధ్య కాబట్టి, ఇక్కడ ఇతర మార్గాల ద్వారా కాకుండా ఆ సూర్యుడి ద్వారానే విద్యుత్తు ప్రసరిస్తుందని ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా సరయూ నది ఒడ్డున 40 మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాలు మొదలు సౌరశక్తితో నడిచే పడవలు, ప్రజా రవాణా, మొబైల్ చార్జింగ్ కేంద్రాలు, ప్రభుత్వ భవనాల విద్యుదీకరణ...ఇలా సర్వం సోలార్ పవర్ ఆధారంగానే నడవనున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రామాలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది త్వరలోనే పూర్తికానుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని సౌరనగరంగా తీర్చి దిద్దడానికి యూపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. యూపీ రాష్ట్ర కొత్త పునరుత్పాదక ఇంధన శాఖ ఈ పనులను చేపట్టనుంది. అదే గనక జరిగితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి సౌర నగరంగా అయోధ్య అవతరించనుంది. ఇందుకోసం ఆ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. జనవరి 22వ తేదీన జరిగే అవకాశమున్న రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్ర ఇప్పటికే ప్రకటించారు.
అదేసమయంలో అయోధ్య నగరాన్ని సౌర కాంతులతో నింపే పనులను ఇటీవల పర్యవేక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'సూర్యవంశానికి రాజధాని అయోధ్య. కాబట్టి, ఇక్కడ ఇతర మార్గాల ద్వారా కాకుండా ఆ సూర్యుడి ద్వారానే విద్యుత్తు ప్రసరిస్తుంది' అని ప్రకటించారు.
సరయూ నది ఒడ్డున సోలార్ పార్కును అభివృద్ధి చేయడం, సౌరశక్తితో నడిచే పడవలను అందించడం, సోలార్ వీధిలైట్లను ఏర్పాటు చేయడం, ప్రజా రవాణాలో భాగంగా సౌరశక్తి తో నడిచే వాహనాలు, బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు వంటి సౌరశక్తితో నడిచే సౌకర్యాలతో పాటు.. నగర విద్యుద్దీకరణ వంటివి ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు, గృహావసరాల కోసం విద్యుత్ ను కూడా సౌరశక్తిని ఉపయోగించే ఇవ్వనున్నారు. సోలార్ ఎనర్జీ పాలసీ ప్రకారం పునరుత్పాదక శక్తి ద్వారా 10 శాతం విద్యుత్ డిమాండ్‌ను తీర్చే ఏ నగరమైనా సోలార్ సిటీగా పరిగణించబడుతుంది. జనవరి నాటికి ప్రారంభ దశలో అయోధ్య ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని UPNEDA అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com