Ayodhya: అయోధ్య రాముడి దర్శనం వేళల్లో మార్పులు..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. ఓ వైపు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తుల రాకతో కిక్కిరిసిపోయింది. ఇంకోవైపు రాముడి దర్శనం కోసం అయోధ్యకు పోటెత్తారు. ఇలా భక్తుల రాకతో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాల రాముడి ఆలయ దర్శనం వేళల్లో స్వల్ప మార్పు చేసింది. ఇకపై ఉదయం 6గంటల నుంచే భక్తులకు బాల రాముడి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. ప్రస్తుతం ఉదయం 7గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తుండగా.. దీన్ని గంట ముందుకు జరపడం ద్వారా ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు భక్తులను అనుమతించనున్నారు.
ఇకపై ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు ఆలయం తెరిచి ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఉదయం 4 గంటలకు ‘మంగళ ఆరతి’ జరుగుతుంది. ఆ తర్వాత ఆలయ తలుపులు కొద్దిసేపు మూసివేయబడతాయి. ఉదయం 6 గంటలకు ‘శృంగర్ ఆరతి’ జరుగుతుంది. ఇది ఆలయం ప్రజల కోసం తెరవబడటానికి గుర్తుగా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ‘‘రాజ్‌భోగ్’ నైవేద్యం సమర్పించబడుతుందని.. ఆ సమయంలో భక్తులకు దర్శనం అనుమతిస్తామని ఆలయ ట్రస్ట్ తెలిపింది. సాయంత్రం 7 గంటలకు ‘సంధ్యా ఆరతి’ నిర్వహించనున్నారు. ఆ సమయంలో ఆలయ తలుపులు 15 నిమిషాలు మూసివేయబడి తిరిగి తెరవబడతాయి. ‘శాయన ఆరతి’ రాత్రి 9.30 గంటలకు బదులుగా రాత్రి 10 గంటలకు నిర్వహించబడుతుంది. ఆ తర్వాత రాత్రికి ఆలయం మూసివేయబడుతుంది.
మరోవైపు జనవరి 26 నుంచి వసంత పంచమి సందర్భంగా కోటి మందికి పైగా భక్తులు అయోధ్య నగరాన్ని సందర్శించారని.. ఇదో సరికొత్త రికార్డు అని యూపీ ప్రభుత్వం పేర్కొంది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహా కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి తరలి వస్తోన్న భక్తులు.. అక్కడి నుంచి అయోధ్య రాముడిని దర్శించుకొనేందుకు వెళ్తుండటంతో రద్దీ అమాంతంగా పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com