Ayodhya Ram Mandir: అయోధ్యలో నేడు అద్భుత ఘట్టం

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఆచారాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ బాలరాముడి విగ్రహ ఊరేగింపు ఘనంగా అయోధ్యకు చేరుకోనుంది. సరయూ నదీ జలాలను మంగళ కలశంలో ప్రత్యేక పూజల మధ్య మందిరానికి తరలించనున్నారు. అయోధ్యకు వచ్చే భక్తులు రామాలయంతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతీ సమాచారాన్ని తెలుసుకునేందుకు దివ్య్ అయోధ్య యాప్ ను యూపీ ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 19 నుంచి అయోధ్య, లఖ్ నవూ మధ్య విమాన సర్వీసును ప్రారంభించనున్నారు. అటు.. ప్రారంభోత్సవం కోసం గుజరాత్ లోని భక్తుడు కానుకగా పంపిన 108 అడుగుల బాహుబలి అగరబత్తీని వెలిగించారు. పంచద్రవ్యాలు కలిపి 3వేల 610 కిలోల బరువుతో తయారు చేసిన ఈ అగరుబత్తీని 5 లక్షల వ్యయంతో భక్తుడు తయారు చేశాడు. మరోవైపు ఆగ్రా నుంచి 560 కిలోల బూడిద గుమ్మడికాయ మిఠాయి, మథుర నుంచి వెయ్యి కిలోల లడ్డూలు అయోధ్యకు తరలించారు.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. జనవరి 22వ తేదీ మద్యాహ్నం నూతన రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్నించి ప్రముఖులు తరలిరానున్నారు. భారీగా భక్తజనం అయోధ్యకు చేరుకుంటున్నారు. రోజుకొక ఆచారం, సాంప్రదాయం చోటుచేసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్ని భక్తులు అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొంటారని అంచనా. జనవరి 21, 22 తేదీల్లో సాధారణ ప్రజలకు ఆలయంలో ప్రవేశం ఉండదు.
జనవరి 16 న సరయు నది తీరాన విష్షు ప్రార్ధన, దశవిధ స్నానం, గోదానం కార్యక్రమాలు
జనవరి 17న రామ్ లల్లా విగ్రహాల ఊరేగింపు, సరయూ నది నీటితో కూడిన మంగళ కలశాలు చేరిక
జనవరి 18న గణపతి అంబికా పూజ, వరుణ పూజ, మాత్రిక పూజ, బ్రాహ్మిన్ వరణ్, వాస్తు పూజలు
జనవరి 19న అగ్నిదేవునికి ప్రత్యేక పూజాది కార్యక్రమాల నిర్వహణ, నవ గ్రహాల ప్రతిష్ఠ
జనవరి 20న రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నది నీటితో శుభ్రం చేయడం, వాస్తు శాంతి నిర్వహణ, అన్నదానం
జనవరి 21న 125 పవిత్ర కలశాలతో రాముడి విగ్రహ స్నానం
జనవరి 22 మద్యాహ్నం 12.30 గంటల్నించి 1 గంట మధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com