Ayodhya Ram Mandir: 25 లక్షల దీపాలతో వెలిగిపోతున్న అయోధ్య రామాలయం.
దీపావళి పండగకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయం దేదీప్యమానంగా వెలిగిపో యింది. బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో బుధవారం రాత్రి దీపావళి సంబరాలు కనులపండువగా జరిగాయి. గత ఎనిమిదేళ్లుగా సరయూ నదీతీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈసారి కూడా అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసింది.
బాలరాముణ్ని దర్శించుకొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా దీపాలు వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. మొత్తం 55 ఘాట్లలో భక్తులు 25 లక్షలకు పైగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించారు. అయోధ్యా నగరం ధగధగ మెరిసిపోయింది. యూపీ టూరిజం విభాగం ఆధ్వర్యంలో భక్తులు ఏకకాలంలో 25,12,585 దీపాలను వెలిగించారు. ఇది ఇంతకు ముందున్న గిన్నిస్ రికార్డును బ్రేక్ చేసింది. అదేవిధంగా 1,121 మంది వేదాచార్యులు ఏకకాలంలో హారతి ప్రదర్శించి మరో గిన్నిస్ రికార్డును సృష్టించారు. కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత ప్రవీణ్ పటేల్ రికార్డులను ప్రకటించారు.
అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుపుకొంటున్న తొలి దీపావళి కావడంతో కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. దీపోత్సవానికి ముందు ‘పుష్పక విమానం’ తరహాలో రామాయణ వేషధారులు హెలికాప్టరు నుంచి దిగారు. వీరంతా కొలువుదీరిన రథాన్ని సీఎం యోగి, మంత్రులు లాగారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్ షో, డ్రోన్ షో, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి. నగరమంతా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేసియా, కాంబోడియా, ఇండోనేసియా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com