Ayodhya Ram Mandir: సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామాలయం

శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య ముస్తాబవుతోంది. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామాలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మరోవైపు నవమి వేడుకలకు సంబంధించిన షెడ్యూల్‌ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రాముడికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం (Surya Tilak) దిద్దనున్నారు. సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదుటిపై పడనున్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
నవమి వేడుకల రోజున ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిషేకం, ఉదయం 10.40 గంటల నుంచి 11.45గంటల మధ్య ఆరాధన కార్యక్రమాల జరగనున్నాయి. ఇక మధ్యాహ్నం 12 గంటలకు హారతి అనంతరం సూర్య తిలకం కార్యక్రమం ఉండనుంది. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యనారాయణుడు తన కిరణాలతో బాలరామయ్యకు తిలకం దిద్దనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com