Ayodhya Ram temple: అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

Ayodhya Ram temple: అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
X
పది రోజుల్లోనే 11 కోట్ల ఆదాయం..

అయోధ్య బాలరాముని దర్శనానికి భక్త జన ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉన్నది.జనవరి 22 వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ పూర్తి చేసుకున్న బాలక్‌రామ్‌ను చూసేందుకు రామ భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల నుంచి భారీగా హుండీ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. బాలక్ రాముడి దర్శనానికి వెళ్లే మార్గంలో మొత్తం 4 హుండీలు ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ ఆఫీస్ ఇంఛార్జ్ ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. గత నెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభమైన విషయం తెలిసిందే. మరుసటి రోజు నుంచి అంటే జనవరి 23 నుంచి బాలక్‌రాముని దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా భక్తులు బాలుని రూపంలో ఉన్న శ్రీరాముడిని చూసి తరించారు. అదేవిధంగా విరాళాల రూపంలో రూ.11 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. ఇందులో హుండీ ఆదాయం రూ.8 కోట్లు ఉండగా, చెక్కులు, ఆన్‌లైన్‌ పేమెంట్‌ రూపంలో మరో రూ.3.5 కోట్లు వచ్చినట్లు ఆలయ ట్రస్టు అధికారి ప్రకాశ్‌ గుప్తా వెల్లడించారు.


ఇక ఆలయ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత సాధారణ భక్తులకు అవకాశం కల్పించిన తొలిరోజే భారీగా భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5 లక్షల మంది బాలక్ రామ్‌ను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత రోజు దాదాపు 3 లక్షల మంది అయోధ్యకు వచ్చినట్లు ట్రస్ట్ పేర్కొంది. ఇక అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో బాలక్‌ రామ్‌ మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు ఇటీవలె పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని దర్శించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అంతకుముందు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు అవకాశం ఉండేది.

రామ్‌లాల్ల దర్శనానికి వస్తున్న భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయంలో నాలుగు హుండీలతోపాటు డిజిటల్‌ రూపంలో వచ్చే విరాళాల కోసం 10 కంప్యూటర్‌ ఆధారిత కౌంటర్లను ఏర్పాటుచేశారు. ప్రతిరోజు ఆలయ వేళలు ముగిసిన తర్వాత హుండీలలో నగదును లెక్కిస్తారు. దీనికోసం 14 మందిని ఆయల కమిటీ నియమించింది. వారిలో 11 మంది బ్యాంకు ఉద్యోగులు ఉండగా, మరో ముగ్గురు ఆలయానికి చెందినవారు ఉన్నారని ప్రకాశ్‌ గుప్తా వెల్లడించారు.

Tags

Next Story