AYODHYA: భక్తులకు సువర్ణావకాశం

AYODHYA: భక్తులకు సువర్ణావకాశం
రాముని సేవ చేసుకునేందుకు అయోధ్య రామాలయ ట్రస్ట్‌ అవకాశం

రాముని సేవ చేసేందుకు భక్తులకు అయోధ్య రామాలయ ట్రస్టు సువర్ణావకాశం కల్పించింది. ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న రామాలయంలో నిర్వహించే హారతి కార్యక్రమానికి భక్తులు హాజరయ్యేందుకు ఆలయ ట్రస్ట్‌ అవకాశమిచ్చింది. దీనికి సంబంధించిన పాసులను ఆన్లైన్లో ఉచితంగా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో..ప్రతి రోజూ నిర్వహించే హారతికి...భక్తులను ఆలయ ట్రస్టు ఆహ్వానం పలుకుతుంది. ఆలయ ప్రారంభోత్సవం అనంతరం రోజుకు మూడు పూటలు హారతి కార్యక్రమం ఉంటుందని... ఇందులో భక్తులు పాల్గొనొచ్చని ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. రామునికి ఇచ్చే హారతి కార్యక్రమంలో కేవలం 30 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఇందులో పాల్గొనేందుకు భక్తులు ముందుగా ప్రవేశ పత్రాలను పొందాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటివరకూ ఆఫ్లైన్లో జారీ చేసిన పాసులను...ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

అయోధ్య రాముని హారతికి భద్రతా కారణాల రీత్యా 30 మందికి మాత్రమే అనుమతి ఉందని..భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు. భక్తులు గుర్తింపు పత్రాలైన ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టుల్లో ఏదైనా ఒక ధ్రువపత్రాన్ని చూపించి పాసులు పొందవచ్చని తెలిపారు. రోజుకు మూడు సార్లు నిర్వహించే ప్రతి హారతికి 20 పాసులను భక్తులకు అందుబాటులో ఉంటాయని...భక్తులు నచ్చిన తేదీల్లో ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అయోధ్య రాముని హారతిలో తమను భాగస్వామ్యం చేసే ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story