Ayodhya: శ్రీరామ ప్రతిష్టకు సుందరంగా ముస్తాబవుతున్న అయోధ్య నగరం

Ayodhya: శ్రీరామ ప్రతిష్టకు సుందరంగా ముస్తాబవుతున్న అయోధ్య నగరం
శరవేగంగా రహదారుల సుందరీకరణ పనులు

రామమందిరం ప్రారంభోత్సవం కోసం అయోధ్యా నగరం ముస్తాబవుతోంది. అయోధ్యలోని కూడళ్లు, రహదారుల సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం నిత్యం భక్తుల తాకిడి ఉండే అవకాశం ఉండటంతో నగరాన్ని ఆ దిశగా యూపీ సర్కారు సిద్ధం చేస్తోంది. మరోవైపు.. మందిరం నిర్మాణ విశేషాలను రామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ మీడియాతో పంచుకుంది.

రామమందిర ప్రారంభ సుముహూర్తం దగ్గరపడ్డ వేళ అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోంది. ఇప్పటికే ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌ను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన ప్రభుత్వం.. ప్రధాన కూడళ్లు, రహదారుల సుందరీకరణ పనులను పూర్తి చేస్తోంది. అయోధ్యకు వచ్చే యాత్రికుల సంఖ్య పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆలయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా సూర్యస్తంభాలు అనే పిల్లర్స్‌ను అలంకరించారు.

అభివృద్ధి పనుల వల్ల 5 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండే నగరం.. ప్రస్తుతం 20 కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరినట్లు తెలిసింది. అయోధ్యలోని వ్యాపార సముదాయాలు యాత్రికులతో కిటకిటలాడుతుండటంతో పండగ వాతావరణం నెలకొంది. రామాయణంలో వాల్మీకి వర్ణించిన అయోధ్య ఎలా ఉండేదో.. ఆ విధంగా శాశ్వతమైన నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉద్యానవనాలు, రోడ్లు, లైటింగ్, ఫిక్చరింగ్‌, ముఖభాగాలు, భవనాల రూపకల్పన వంటివన్నీ రామాయణం ఆధారంగా చేపట్టినట్లు వివరించారు. అయోధ్యలోని చూడాల్సిన చారిత్రక, పర్యాటక ప్రదేశాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. దశరథుని సమాధి, సీతామహల్‌, తీన్‌కలాశ్‌ ఆలయం వంటి వాటిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.అయోధ్యకు రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా.. ప్రభుత్వం స్వచ్ఛతా చర్యలు చేపట్టింది. కాలుష్యం లేని విద్యుత్‌ వాహనాల సంఖ్యను పెంచుతోంది. తొలి విడతలో భాగంగా 12 వాహనాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం వాటిని 500లకు విస్తరిస్తామని తెలిపింది.

మరోవైపు రామాలయ విశేషాలను జన్మభూమి తీర్థక్షేత్ర వెల్లడించింది. ఆలయాన్ని నాగర నిర్మాణ శైలిలో నిర్మిస్తున్నట్లు ఇప్పటికే తెలిపిన ట్రస్టు.. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో మందిర నిర్మాణం జరుగుతోందని తెలిపింది. ఆలయంలో 3 అంతస్తులు ఉన్నాయనీ.. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుందని వివరించింది. 392 స్తంభాలు, 44 గేట్లు ఉంటాయి. తొలి అంతస్తులో శ్రీరామ దర్బార్‌, ప్రధాన ఆలయం గర్భగుడిలో బాల రాముడి విగ్రహం ఉంటుంది. నృత్యం, రంగమండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తనా అనే ఐదు మండపాలుంటాయి.తూర్పున సింహద్వారం నుంచి ఆలయం లోపలికి వెళ్లాలి. ఇక్కడ 32 మెట్లు ఉంటాయి. వృద్ధులు, దివ్యాంగుల కోసం లిఫ్టులు, ర్యాంపులు ఉండనున్నాయి.

Tags

Next Story