AYODHYA: పుణ్య ఘట్టానికి అయోధ్య సిద్ధం

AYODHYA: పుణ్య ఘట్టానికి అయోధ్య సిద్ధం
భారీ ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌... అందుబాటులోకి దివ్య అయోధ్య యాప్‌

దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా కొలువు తీరుతున్న అయోధ్య నగరం ఆ పుణ్య ఘట్టానికి సిద్ధమైంది. ఇందుకోసం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కార్యక్రమానికి విచ్చేసే అతిథులు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా సకల సౌకర్యాలు కల్పించింది. రామమందిరం తోపాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారాన్ని తెలుసుకునేందుకు యూపీ సర్కార్‌ దివ్య అయోధ్య యాప్‌ను ఏర్పాటు చేసింది. అయోధ్య శ్రీరాముడి దర్శనానికి వచ్చే భక్తులకు మోతీచూర్ లడ్డూ, అయోధ్యా శ్రీరాముని పురిటిగడ్డ మట్టిని మహాప్రసాదంగా ఇవ్వనున్నారు. జనవరి 23 నుంచి భక్తులకు రామ్ లల్లా దర్శనభాగ్యం లభించనుంది. ఉత్తరప్రదేశ్ పర్యాటకశాఖ అయోధ్యకు వచ్చే అతిధుల కోసం ప్రత్యేకంగా టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. పలు హైటెక్ సదుపాయాలున్న ఇందులోని కాటేజ్ లను వీవీఐపీల బసకోసం కేటాయించనున్నారు.


నిషాద్ రాజ్ అతిధి గృహ్ పేరిట ఈ టెంట్‌ సిటీని నిర్మించారు. భోజనాల కోసం సీతారసోయి, శబరి రసోయి పేరిట రెండు డైనింగ్ హాళ్లను నిర్మించారు. ఇందులో ఒకేసారి 500 మంది వీఐపీలు భోజనం చేయవచ్చు. పర్యాటకులు సరయూ నదిలో విహరించేందుకు సౌరశక్తి పడవల్ని ఏర్పాటు చేశారు. అయోధ్యా నగరమంతా శాస్త్రీయ సంగీతం వినిపించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీత విద్వాంసుల్ని ఎంపిక చేశారు. అయోధ్య గర్భాలయంలో ఉన్న బాలరాముడిని రోజుకు రెండు లక్షల మంది దర్శించుకునే వెసులుబాటు ఉంది. గర్భాలయంలో అష్టధాతువులతో నిర్మించిన 600 కిలోల గంట ప్రత్యేక ఆకర్షణ. గర్భాలయాన్ని తెల్లటి మకరానా పాలరాతతో తీర్చిదిద్దారు. ప్రధానమైన గర్భాలయ ముఖద్వారాన్ని, తలుపులను తయారుచేసే అవకాశం హైదరాబాదుకు చెందిన అనురాధ టింబర్ డిపో వారికి దక్కింది. నాణ్యమైన బర్మాటేకును వినియోగించి భారీ దర్వాజల్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ ద్వారాలపై బంగారు తాపడం చేయనున్నారు.


రాములవారికి పాదుకల్ని సమర్పించే భాగ్యం కూడా తెలుగువారికే దక్కింది. హైదరాబాదుకు చెందిన భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాస శాస్త్రి కిలో బంగారుపూత పూసిన 9 కిలోల పాదుకల్ని సమర్పించారు. 41 రోజులపాటు వివిధ క్షేత్రాల్లో ప్రాదుకా దర్శనం అనంతరం అయోధ్యకు తరలించారు. 108 అడుగుల పొడవాటి అగరుబత్తిని గుజరాత్ లోని వడోదర నుంచి అయోధ్యకు తరలించారు. పంచగవ్యాలతో, హవన పదార్థాలతో తయారుచేసిన ఈ మహా అగరుబత్తి బరువు 3 వేల 500 కిలోలు ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఆరు నెలలకాలం పట్టింది. దీనికి 5 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. శ్రీరాముడి అత్తవారిల్లు జనక్ పూర్ నుంచి నూతన వస్త్రాలు, ఫలాలు, డ్రైఫ్రూట్స్ అయోధ్యకు చేరుకున్నాయి. ఆభరణాలు, వెండి పాత్రలు, దుస్తులతోపాటు అనేక రకాల ఆహారపదార్థాలను నేపాల్ ప్రభుత్వం అయోధ్యకు పంపించింది.

Tags

Read MoreRead Less
Next Story