Ayodhya: పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న లతా మంగేష్కర్ చౌక్

అయోధ్య రామ మందిరం మరో 4 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి ఐకానిక్ లతా మంగేష్కర్ చౌక్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. 40అడుగుల పొడవు, 12అడుగుల ఎత్తుతో ఉన్న భారీ వీణను చూసేందుకు సందర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరు ఔత్సాహికులు దేవుళ్ల వేషధారణలో అక్కడికి వచ్చి ఆటపాటలతో అలరిస్తున్నారు. ఇప్పటికే సెల్ఫీ పాయింట్‌గా మారిన లతా చౌక్ వద్ద రంగు రంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో రాత్రివేళ మరింత శోభను సంతరించుకుంది.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో అక్కడి లతాచౌక్ చూపరులను కట్టిపడేస్తోంది. ఇప్పటికే సెల్ఫీ పాయింట్‌గా మారిన లతాచౌక్‌లోని భారీ వీణ ఉన్న ప్రాంతం, రోజురోజుకూ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. కొందరు ఔత్సాహికులు దేవుళ్ల వేషధారణలో అక్కడికి వచ్చి తమ భక్తిని చాటుతున్నారు . పుణ్యకార్యాల్లో, నూతన గృహ ప్రవేశాలలో, తీర్థయాత్ర ప్రారంభ సమయాలలో చేసే కలశ యాత్రను కొందరు భక్తులు లతా చౌక్ వద్ద చేపట్టారు. మరికొందరు డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తున్నారు.
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థంగా 2022లో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన ఈ భారీ వీణ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఫైజాబాద్‌కు వెళ్లే రహదారిపై ఉన్న ఈ చౌక్ ఒకవైపు సరయూ ఘాట్ మరో వైపు రామ మందిరానికి దారితీసే రామ్ పాత్‌ను కలుపుతుంది. చాలా మంది సందర్శకులు అయోధ్య పర్యటనకు వస్తే కచ్చితంగా ఇక్కడ ఆగి ఫొటోలు తీసుకుంటున్నారు. ఇక రాత్రివేళ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో లతా చౌక్ మరింత శోభను సంతరించుకుంది.
40 అడుగులు పొడవు, 12అడుగుల ఎత్తు, 14 టన్నుల బరువున్న ఈ వీణను ప్రధాని మోదీ 2022 సెప్టెంబర్ 28న వర్చువల్‌గా ప్రారంభించారు. ఇటీవల అయోధ్య పర్యటనలో కూడా లతా చౌక్ వద్ద ప్రధాని కాసేపు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com