Babita Phogat: హర్యానా కాంగ్రెస్ సీనియర్ నేతపై బబిత ఫైర్
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఆమెకు పార్టీ అధిష్టానం జులానా నియోజకవర్గం అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే వినేశ్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కుటుంబ సభ్యుల నుండే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వినేశ్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆమె పెద్దనాన్న మహావీర్ ఫోగాట్ తప్పుబట్టారు. వినేశ్ ఫోగాట్ తదుపరి ఒలింపిక్స్ పై దృష్టి పెట్టకుండా రాజకీయాల్లోకి రావడం చాలా పెద్ద తప్పు అని సోమవారం ఆయన వ్యాఖ్యానించారు.
తాజాగా ఆమె బంధువు, బీజేపీ నేత బబిత ఫోగాట్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ హుడా పన్నిన పన్నాగం కారణంగా వినేశ్ కుటుంబంలో చీలిక వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ విధానమే విభజన విధానమని దుయ్యబట్టారు. రాజకీయ లబ్దికోసమే వినేశ్ కుటుంబంలో కాంగ్రెస్ చీలిక తెచ్చిందని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విభజించి పాలించడమే కాంగ్రెస్ అజెండా అని విమర్శించారు.
తమ పెద్దనాన్న మహావీర్ ఫోగాట్ సలహాలను వినేశ్ పాటించాలని కోరారు. వినేశ్ గురువు మహావీర్ అని, ఆయనే సరైన మార్గనిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. 2028లో వినేష్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకునే సత్తా ఉందన్నారు. రాజకీయాలను వదిలి రెజ్లింగ్‌పై దృష్టి పెట్టాలని వినేష్‌కు బబిత సూచించారు. వినేష్ ఫోగట్ సెప్టెంబర్ 6న కాంగ్రెస్‌లో చేరారు. కొద్ది సేపటికే జులానా నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. 2019లో బీజేపీలో చేరిన బబితకు మాత్రం ఈ ఎన్నికల్లో కమలం పార్టీ సీటు కేటాయించలేదు. అయినా బాధలేదని ఆమె చెప్పుకొచ్చారు. బీజేపీకి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. బీజేపీ ఇప్పటి వరకు రెండు జాబితాలను వెల్లడించింది. మొత్తం 88 స్థానాలకు పేర్లు ప్రకటించింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com