Bajrang Punia: బజరంగ్ పునియాకు విదేశీ నంబర్ నుంచి హత్య బెదిరింపు

దేశంలోని ప్రముఖ రెజ్లర్, ఇటీవల కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్ అయిన బజరంగ్ పునియాకు విదేశీ నంబర్ నుంచి హత్య బెదిరింపు వచ్చింది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయనకు వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది.. ‘బజరంగ్, కాంగ్రెస్‌ని వీడి వెళ్లండి.. లేకపోతే మీకు, మీ కుటుంబానికి మేలు జరగదు.. ఇదే మా చివరి సందేశం.. ఎన్నికలకు ముందు మా సంగతి ఏంటో చూపిస్తాం. మీకు కావలసిన చోట ఫిర్యాదు చేయండి. ఇది మా మొదటి, చివరి హెచ్చరిక.” అని రాశారు. ఈ బెదిరింపు తర్వాత బజరంగ్ సోనిపట్ బహల్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీలు విచారణ ప్రారంభించారు. జాతీయ క్రీడాకారుడు, ప్రజలలో పేరుగాంచిన బజరంగ్ కి ఇలాంటి మెసేజ్ రావడంపై ప్రజల్లో ఆందోళన, ఆగ్రహాన్ని సృష్టించింది.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. భజరంగ్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యక్తికి ఇలాంటి ముప్పు రావడం ఇదే మొదటిసారి కాదు. అయితే.. ఈ మెసేజ్ తో పూనియా ప్రాణాలకు ప్రమాదం రావొచ్చనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ బెదిరింపు తర్వాత.. బజరంగ్ పునియా భద్రతపై దృష్టి పెట్టారు. భద్రతను పెంచారు.
కాగా.. ప్రముఖ రెజర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల నేపథ్యంలో వీరి చేరిక కాంగ్రెస్‌కి కీలకంగా మారింది. వచ్చే నెల తొలివారంలో హర్యానా అసెంబ్లీలోని 90 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వరసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంటే, ఈ సారి ఎలాగైనా హర్యానాని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీని కోసం ఏ అవకాశాన్ని వదిలేయొద్దని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోగట్, పునియాలను చేర్చుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com