Bangladesh: దుర్గా పూజకు బంగ్లాదేశ్ నుంచి 1200 టన్నుల పులస చేపల ఎగుమతి

దుర్గా పూజ పండగను పురస్కరించుకుని భారత్‌కు పులస చేపలను (స్థానికంగా ఇలిష్ అని పిలుస్తారు) ఎగుమతి చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతి నిచ్చింది. అయితే, గతేడాదితో పోలిస్తే ఈసారి ఎగుమతి పరిమాణాన్ని దాదాపు సగానికి తగ్గించింది. ఈ మేరకు సోమవారం బంగ్లాదేశ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది మొత్తం 1,200 టన్నుల (12 లక్షల కిలోలు) పులస చేపలను భారత్‌కు పంపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కిలో చేప కనీస ఎగుమతి ధరను 12.50 అమెరికన్ డాలర్లుగా (సుమారు రూ. 1,520) నిర్ణయించారు. ఎగుమతిదారులు తమ ట్రేడ్ లైసెన్స్‌లు, పన్ను పత్రాలతో సెప్టెంబర్ 11లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
గతేడాది బంగ్లాదేశ్ ప్రభుత్వం 2,420 టన్నుల పులస చేపల ఎగుమతికి అనుమతి ఇవ్వగా, ఈసారి ఆ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించడం గమనార్హం. అంతేకాకుండా, ఎగుమతిదారులకు పలు కఠిన నిబంధనలు కూడా విధించారు. కేటాయించిన కోటాను మించకూడదని, అనుమతులను ఇతరులకు బదిలీ చేయరాదని స్పష్టం చేశారు. ఎగుమతి ప్రక్రియను ఏ దశలోనైనా నిలిపివేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నిర్ణయంపై భారత్‌లో బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా 'ఎక్స్' వేదికగా స్పందించారు. "పండగ సీజన్‌కు ముందు స్నేహానికి గుర్తుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌కు ఇలిష్ చేపలను ఎగుమతి చేయాలని నిర్ణయించింది" అని ఆయన తెలిపారు. ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజ సమయంలో పులస చేపలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com