China Manja: రెండు రోజుల్లో 1000 ప‌క్షుల‌ను బలి

China Manja:  రెండు రోజుల్లో 1000 ప‌క్షుల‌ను బలి
ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా

సంక్రాంతి పండుగ వ‌చ్చిందంటే చాలు గాలి ప‌టాల‌ను ఎగుర‌వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు. ఈ ప‌తంగుల‌ను ఎగుర‌వేసేందుకు నిషేధించ‌బ‌డిన చైనా మాంజాను ఉప‌యోగిస్తుంటారు. ఈ చైనా మాంజా మ‌న‌షుల ప్రాణాల‌ను కూడా బ‌లి తీసుకుంది. చివ‌ర‌కు ప‌క్షుల‌కు కూడా ఆ మాంజా చుట్టుకోవ‌డంతో అవి కూడా విల‌విల‌లాడిపోయాయి. ఈ రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే ఒక్క ముంబైలో 1,000 ప‌క్షులు చ‌నిపోయాయి. మ‌రో 800 ప‌క్షులు తీవ్రంగా గాయ‌ప‌డ్డాయి.


ముంబై న‌గ‌ర వ్యాప్తంగా 25 ఫ్రీ బ‌ర్డ్ మెడిక‌ల్ క్యాంపుల‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో గాయ‌ప‌డ్డ ప‌క్షుల‌కు ప‌క్షి ప్రేమికులు ప్ర‌త్యేక చికిత్స అందించారు. ద‌హిస‌ర్, బోరివాలి, కందివాలి, మ‌లాద్ ఏరియాల్లో సుమారు 500ల‌కు పైగా ప‌క్షులను ప్రాణాల‌తో ర‌క్షించారు. కొన్ని ప‌క్షుల కాళ్ల‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో అవి ఎగ‌ర‌లేక పోతున్నాయి. అలాంటి వాటిని ప్ర‌త్యేక షెల్ట‌ర్ల‌లో ఉంచి ప‌ర్య‌వేక్షిస్తామ‌ని ప‌క్షి ప్రేమికులు తెలిపారు. చికిత్స అనంత‌రం కొన్ని ప‌క్షులు గాల్లోకి ఎగిరిపోయాయి.

చైనా మాంజా ప్ర‌మాదక‌రం.. దాన్ని వినియోగించొద్ద‌ని ఈ ఏడాది సోష‌ల్ మీడియా వేదిక‌గా విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింద‌ని ప‌క్షి ప్రేమికులు తెలిపారు. ఈ మాంజా ప‌క్షుల‌కు త‌గ‌ల‌డంతో అవి ప్రాణాలు కోల్పోతున్నాయని, మ‌న‌షుల‌కు కూడా ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌ని ప్ర‌చారం చేశామ‌న్నారు. మ‌న ఆనందం కోసం ప‌క్షుల‌కు ఇబ్బంది క‌లిగించొద్ద‌ని ప్ర‌చారం చేసిన‌ట్లు చెప్పారు. ఈ ప్ర‌చారం వ‌ల్ల చైనా మాంజాను చాలా త‌క్కువ‌గా వినియోగించిన‌ట్లు పేర్కొన్నారు.


చైనా మాంజాపై నిషేధమున్నా వ్యాపారులు దొడ్డిదారిన తెచ్చి విక్రయిస్తున్నారు. గాలిపటానికి కట్టిన మాంజా తెగిపోదు. నైలాన్‌ దారం, గాజుముక్కల పొడితో కలిపి దాన్ని తయారుచేయడం వల్ల చాలా మృదువుగా తెగని విధంగా ఉంటుంది. ప్రమాదమని తెలిసినా.. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఈ మాంజా కొనిపెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story