Loksabha Elections: ఐదో దశలో 57.47శాతం పోలింగ్ నమోదు

పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా లోక్‌సభ ఐదో దశ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఆరు రాష్ర్టాలు, రెండు యూటీల్లోని 49 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 59.06 పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించింది. పశ్చిబెంగాల్‌లో అత్యధికంగా 73.14 శాతం పోలింగ్ నమోదు కాగా, మహారాష్ట్రలో అత్యల్పంగా 53.51 శాతం మంది మాత్రమే ఓటేశారు. ఈ దశలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు. 2019లో ఏడు రాష్ర్టాల్లోని 51 స్థానాలకు జరిగిన ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో 64.16% పోలింగ్ నమోదైంది. తాజాగా లోక్‌సభ ఎన్నికల ఐదో దశ ముగియడంతో ఇప్పటి వరకు మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు 25 రాష్ర్టాలు/యూటీల్లో 428 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈనెల 25న ఆరో దశ, జూన్ 1న చివరి దశ జరుగునున్నాయి.
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం 59% పోలింగ్ నమోదుతో ఆల్‌టైమ్ రికార్డు కొట్టింది. కొన్ని దశాబ్దాలుగా సింగిల్ డిజిట్ పోలింగ్ నమోదయ్యే బారాముల్లా పరిధిలోని సోపోర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి 44.36% మంది ఓటేశారని జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రధానాధికారి పీకే పోల్ తెలిపారు. ఇక్కడ 17.37 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఈసారి మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సహా 22 మంది బరిలో ఉన్నారు.
పశ్చిమబెంగాల్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకొన్నాయి. బకర్‌పోర్, బొంగావ్, ఆరంబాఘ్, హుగ్లీలలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పశ్చిబెంగాల్‌తోపాటు ఒడిశాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. తమ గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు రోడ్డు, రైలు కనెక్టివిటీ కల్పించనందుకు నిరసనగా యూపీలోని కౌశాంబి జిల్లా హిసంపూర్ మధో గ్రామ ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. వివిధ పార్టీల నుంచి 1,913 ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల సంఘం పేర్కొన్నది.
లోక్‌సభ ఎన్నికల తొలి నాలుగు దశల్లో 2019తో పోలిస్తే దాదాపు 2.5 కోట్ల ఓట్లు అధికంగా పోలయ్యాయని ఎస్‌బీఐ తాజా పరిశోధనా నివేదిక పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డాటాను ఉటంకించింది. నాలుగు దశల ఎన్నికల్లో 45.1 కోట్ల మంది ఓటేశారని, మొత్తంగా 66.95 పోలింగ్ శాతం నమోదైందని తెలిపింది. అయితే శాతం పరంగా చూస్తే 2019 ఎన్నికల సమయంలో నాలుగు విడతల్లో 68.15 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించింది. పోలింగ్ జరిగిన 90 శాతం నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు పెరుగడమో లేదా గత ఎన్నికలతో పోలిస్తే అటుఇటూగా ఉండటమో జరిగింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తంగా దాదాపు 67.5 శాతం పోలింగ్ నమోదవుతుందని అంచనా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com