PM Modi: ఏఐతో ఉద్యోగాలు పోవు కానీ .. పారిస్ సదస్సులో ప్రధాని ..

PM Modi:  ఏఐతో ఉద్యోగాలు పోవు  కానీ  .. పారిస్ సదస్సులో ప్రధాని  ..
X
ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం..

అన్ని రంగాల్లోకి దూసుకొస్తున్న కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు మాయమవుతాయన్న భయాలను ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికగా పటాపంచలు చేశారు. సాంకేతికత వాడ కం వల్ల ఉద్యోగాలు కనుమరుగుకావని తేల్చిచెప్పారు. కేవలం ఉద్యోగాల స్వభావమే మారుతుందని స్పష్టం చేశారు. ఏఐ వాడకంతో కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌తో కలిసి మంగళవారం ఏఐ యాక్షన్‌ సమ్మిట్‌–2025కు సహాధ్యక్షత వహించిన ప్రధాని మోదీ ఈ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

ఏఐ ఆధారిత భవిష్యత్తులో రాణించాలంటే నైపుణ్యాలను పెంచుకోవడం, వాటికి మెరుగులు దిద్దుకోవడంపై యువత దృష్టిపెట్టాలని సూచించారు. అదే సమయంలో ఓపెన్‌సోర్స్‌ ఆధారిత ఏఐ వినియోగంలో ప్రజావిశ్వాసం, పారదర్శకత పెంచేలా, ఈ రంగంలో వివక్షను రూపుమాపేలా ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పనకు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉందన్నారు.

చరిత్ర చెప్పేది అదే..

‘కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనేది అత్యధికం మందిని కలవరపరిచే అంశం. కానీ టెక్నాలజీ వల్ల పని మాయం కాదని చరిత్ర చాటిచెప్పింది. కేవలం పని స్వభావం మారి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అందుకు తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి. నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి. కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి’అని మోదీ సూచించారు. ఈ శతాబ్దిలో కృత్రిమ మేధ మానవాళికి కోడ్‌ను రాస్తోందని.. కానీ మానవ చరిత్రలోని ఇతర మైలురాళ్లకన్నా ఇది ఎంతో విభిన్నమైనదన్నారు.

‘‘ఏఐ ఇప్పటికే మన రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాలతోపాటు సమాజాన్ని పునరి్నరి్మస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలను మెరుగుపరచడం ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాలను ఏఐ మార్చగలదు. ఇంకెన్నింటినో చేయగలదు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మరింత సులభంగా, వేగంగా చేరుకోవడంలో దోహదపడగలదు. ఇందుకోసం మనం మన వనరులు, ప్రతిభను ఏకం చేయాలి’అని మోదీ పేర్కొన్నారు.

ఏఐలో భారత్‌ సత్తా..

ఓపెన్‌ నెట్‌వర్క్, యాక్సెసబుల్‌ నెట్‌వర్క్‌ సాయంతో తక్కువ ఖర్చుతోనే భారత్‌ 140 కోట్ల మందికిపైగా ప్రజల డిజిటల్‌పరమైన మౌలిక వసతులను విజయవంతంగా అభివృద్ధి చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ‘ప్రజాపయోజనాల కోసం మేం ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. భారత్‌లోని భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సొంతంగా లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం)ను అభివృద్ధి చేస్తున్నాం’అని మోదీ తెలిపారు. స్టార్టప్‌లు, పరిశోధకులకు అందుబాటు ధరలో సాంకేతిక వనరులను అందించేందుకు ప్రత్యేకమైన ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని భారత్‌ అభివృద్ధి చేసిందన్నారు.

ఏఐ భవిత ఉన్నతంగా, అందరికీ అందుబాటులో ఉండే విషయంలో భారత్‌ తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ప్రపంచంతో పంచుకొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. డేటా సాధికారత, పరిరక్షక వ్యవస్థ ద్వారా డేటా శక్తిని అందిపుచ్చుకుందని వివరించారు. ‘మేం డిజిటల్‌ కామర్స్‌ను ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేశాం.

భారత్‌ తీసుకొచ్చిన నేషనల్‌ ఏఐ మిషన్‌కు ఈ దృక్పథమే పునాది. మా హయాంలో జీ20 దేశాలకు సారథ్యం వహించినప్పుడు కృత్రిమ మేధ వాడకం బాధ్యతాయుతంగా ఉండేలా, అందరి మంచికి ఉపయోగపడాలనే విషయంలో ఏకాభిప్రాయం సాధించాం. ప్రస్తుతం ఏఐ వినియోగం, డేటా గోప్యతకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనడంలో భారత్‌ ముందుంది’అని మోదీ తెలిపారు.

Tags

Next Story