DMK: ఆ చట్టంతో వ్యక్తిగత హక్కులు కోల్పోతాం

ఉమ్మడి పౌరస్మృతిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని DMK వెల్లడించింది. అందరికీ ఒకే విధానం అన్న విధానానికి వ్యతిరేకమని పేర్కొంది. UCC అమలు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ లా కమిషన్ ఛైర్మన్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖ రాశారు. సమాజంలోని భిన్న వ్యవస్థలను ఇది సవాలు చేయడంతోపాటు తీవ్ర ముప్పుగా మారుతుందని అందులో పేర్కొన్నారు.
భిన్న సంప్రదాయాలు కలిగిన సమాజంగా పేరొందిన భారత్ లో UCCని అమలు చేయాలనే ఆలోచనను వ్యతిరేకిస్తున్నామని..... సమాజంలో భిన్న వ్యవస్థలను అది సవాలు చేయడంతోపాటు ముప్పుగాను మారుతుందన్నారు. ఆర్టికల్ 29ని అనుసరించి మైనార్టీ హక్కులను కాపాడుతూ, వాటిని గౌరవిస్తున్న భారత్ లౌకిక దేశంగా గర్విస్తోందని స్టాలిన్ పేర్కొన్నారు. జిల్లా, ప్రాంతీయ మండళ్ల ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలు వారి సంప్రదాయాలు, పద్ధతులను కాపాడుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పిస్తోందన్నారు. ఈ గిరిజన వర్గాలనూ ప్రభావితం చేసే సామర్థ్యం UCCకి ఉందని... సమాజంలో నెలకొన్న సామాజిక ఆర్థిక అసమానతలను పరిగణనలోకి తీసుకోకుండా దీన్ని అమలు చేస్తే తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని స్టాలిన్ లేఖలో వివరించారు.
అంతే కాదు ఉమ్మడి పౌరస్మృతిని ముందుగా హిందువులకు వర్తింపచేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే పట్టుపట్టింది. ఆపై అన్ని కులాల వారిని ఆలయాల్లోకి అనుమతించాలని కోరింది. ఉమ్మడి పౌరస్మృతిని ముందుగా హిందూ మతంలో ప్రవేశపెట్టాలని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజలందరినీ దేశంలోని ఏ ఆలయంలోనైనా పూజలు చేసేందుకు అనుమతించాలని అన్నారు. ప్రతి మతానికి రాజ్యాంగం రక్షణ కల్పించినందునే తాము యూసీసీని కోరుకోవడం లేదని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com