Bengal: వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లో హింస

వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి పశ్చిమబెంగాల్ అట్టుడుకుతోంది. గత కొద్ది రోజులుగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితుల్ని గమనించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్‌లో వక్ఫ్ చట్టం అమలు చేయబోమని తేల్చి చెప్పారు. విభజన రాజకీయాలను ఏ మాత్రం అంగీకరించనని పేర్కొన్నారు. అయినా కూడా బెంగాల్‌లో అల్లర్లు మాత్రం ఆగలేదు.
శుక్రవారం ఉవ్వెత్తున నిరసనలు ఎగిసిపడ్డాయి. భారీగా హింస చెలరేగింది. దీంతో పెద్ద ఎత్తున ఆస్తులు ధ్వంసం అయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి రైల్వే పోలీస్ ఫోర్స్ సిబ్బంది లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. భద్రతా సిబ్బందిపై ఆందోళనకారులు కూడా రాళ్ళు రువ్వారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అనంతరం సరిహద్దు భద్రతా దళ సిబ్బంది కూడా మోహరించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు సమాచారం.
మైనారిటీలు ఎక్కువగా నివసించే ముర్షిదాబాద్ జిల్లాలోని నిమ్టిటా, సుటి దగ్గర ఆందోళనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిమ్టిటా రైల్వే స్టేషన్ దగ్గర నిరసనకారులు గంటల తరబడి రైల్వే ట్రాక్‌లను దిగ్బంధించి.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన రైల్వే పోలీస్ ఫోర్స్ సిబ్బంది లాఠీచార్జ్ చేశారు.
దక్షిణ 24 పరగణాల జిల్లాలోని అమ్తాలా ప్రాంతంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలు.. స్థానిక పోలీసు సిబ్బందిపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ప్రతిఘటించారు. దీంతో జాతీయ రహదారి 117 పై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. హుగ్లీ జిల్లాలోని చంపానీలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.
ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ విధంగా అల్లర్లు సృష్టించడం చట్టాన్ని వ్యతిరేకించినట్లేనన్నారు. క్రూరమైన రాడికల్ మూకల కారణంగా ప్రజా భద్రత దెబ్బతింటుందని వ్యా్ఖ్యానించారు. నిరసనల పేరుతో హింస, అరాచకం సృష్టించడం చట్టవిరుద్ధమైన కార్యక్రమాలని పేర్కొన్నారు.
ఇక ఈ హింసపై గవర్నర్ సీవీ. ఆనంద బోస్.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్‌తో మాట్లాడి… పరిస్థితిని అదుపులో ఉంచడానికి పోలీసులు సత్వర మరియు కఠినమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ సందేశాన్ని అందజేశారు. ముఖ్యమంత్రితో కూడా చర్చలు జరిపినట్లు గవర్నర్ తెలిపారు. బెంగాల్‌లో కొన్ని ప్రాంతాల్లో హింస సృష్టించే అవకాశం ఉందని.. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com