Asansol Lok Sabha Polls 2024 : బంగాల్​లో బిహారీ Vs సర్దారీ

Asansol Lok Sabha Polls 2024 : బంగాల్​లో బిహారీ  Vs సర్దారీ
X
అసన్‌సోల్‌ నియోజకవర్గంపై భాజపా, తృణముల్‌ కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి

పశ్చిమ్‌ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ నియోజకవర్గంపై భాజపా, తృణముల్‌ కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించాయి. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన భాజపా మరోసారి అదే దూకుడు ప్రదర్శించాలని చూస్తోంది. 2022లో అసన్‌సోల్‌కు జరిగిన ఉపఎన్నికలో తృణముల్‌ కాంగ్రెస్ బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్న సిన్హా ను బరిలో దించి విజయం సాధించింది. దీంతో శత్రుఘ్న సిన్హాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సర్దార్‌జీగా పేరొందిన సీనియర్‌ నేత సురేంద్రజీత్‌ సింగ్‌ను భాజపా బరిలో దించింది.

పశ్చిమ్‌ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్న భాజపా.. లోక్‌సభ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అసన్‌సోల్‌ స్థానంపై దృష్టి సారించింది. బొగ్గు గనులకు నిలయమైన ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక్కడి నుంచి టీఎంసీ తరఫున బిహారీ బాబుగా పేరొందిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శత్రుఘ్నసిన్హా బరిలోఉండగా, సర్దార్‌జీగా పేరొందిన సీనియర్‌ నేత సురేంద్రజీత్‌ సింగ్‌ అహ్లూవాలియాను భాజపా బరిలో దింపింది. దీంతో ఈ స్థానంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

మైనింగ్‌తో పాటు పరిశ్రమలకు నిలయమైన అసన్‌సోల్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న రాణిగంజ్‌, పాండవేశ్వర్‌, జమురియా అసెంబ్లీ నియోజకవర్గాలు బొగ్గు గనులు, పరిశ్రమలకు ప్రసిద్ధి. ఝార్ఖండ్‌కు సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో హిందీ మాట్లాడేవారే అధికంగా నివసిస్తున్నారు. ఇక్కడి గనులు, పరిశ్రమల్లో పని చేసేవారు ఎక్కువగా బిహార్‌, యూపీ నుంచి వచ్చినవారే. దీంతో వారిని ఆకర్షించేందుకు అధికార, విపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. మూడు దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల చేతుల్లో ఉన్న ఈ స్థానాన్ని 2014, 2019 ఎన్నికల్లో భాజపా కైవసం చేసుకుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో ఈ స్థానాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ దక్కించుకుంది.

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శత్రుఘ్నసిన్హా పట్నాకు చెందినవారు. బిహారీ బాబుగా పేరొందిన ఆయన్ను తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోసారి బరిలో నిలిపింది. అసన్‌సోన్‌ స్థానికుడైన సురేంద్రజీత్‌ సింగ్‌ అహ్లూవాలియాను భాజపా పోటీలో నిలిపింది. రాజ్యసభ మాజీ ఎంపీ అయిన సింగ్‌.. 2014లో దార్జీలింగ్‌, 2019లో బర్ధమాన్‌-దుర్గాపుర్‌ నుంచి గెలుపొందారు. ఎంపీలుగా ఉన్న ఇద్దరు నేతలు.. వారి సిటింగ్‌ స్థానాలకు ఏం చేశారని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. నాలుగో విడతలో భాగంగా మే 13న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది

Tags

Next Story