Rameshwaram Cafe: రామేశ్వరం కెఫే పేలుడు తరువాత ఏం జరిగింది

రామేశ్వరం కెఫే పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ -NIAకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. నిందితుడు ఏమార్గంలో కెఫేలోకి వచ్చాడు బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా బెంగళూర్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కెఫే పేలుడు కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ-NIAకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకొంది. బెంగళూరులో పోలీసు దర్యాప్తు బృందాలు...నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. నిందితుని ఆచూకీ కోసం పరిసరాల్లోని దుకాణాలకు అమర్చిన సీసీకెమేరాల రికార్డులను పోలీసులు సేకరించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా నిందితుడు టోపీ ,కళ్లజోడు ధరించి కర్చీఫ్‌తో ముఖాన్ని కవర్ చేసుకొన్నట్లు గుర్తించారు. అనుమానితుడు కెఫే సమీపంలో రూట్ నంబర్ 500-D బస్సు దిగినట్లు సీసీకెమేరా దృశ్యాలద్వారా నిర్ధారించారు. పేలుడుకు దాదాపు గంట ముందు అతడి కదలికలను పోలీసులు గుర్తించారు. శనివారమే కెఫేలోని డిజిటల్ వీడియో రికార్డర్‌ను కూడా స్వాధీనం చేసుకొన్నారు..
నిందితుడిని పోలీసులు గుర్తించారని..అతడి వయస్సు 28 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. త్వరలోనే నిందితున్ని అరెస్టు చేస్తామన్నారు. శివమొగ్గ, మంగళూరు పేలుళ్లకు దీనికి సంబంధం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆ రెండు ప్రాంతాలకు చెందిన పోలీసులు కూడా ఈ దర్యాప్తుకు.......సాయం చేస్తున్నారన్నారు. ఘటనకు సంబంధించి దాదాపు 50 వరకు దృశ్యాలను సేకరించినట్లు......కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర చెప్పారు
ఈ ఘటనలో మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చినట్లు గుర్తించారు. రవ్వ ఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చుని.. పేలుడుకు ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. అతడు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లోని బాంబుకు టైమర్ సెట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com