Ikea : స్నాక్స్ తింటుండగా పైనుంచి పడిన ఎలుక

ఏదన్నా తింటున్నప్పుడు మనం చాలా నీట్ గా క్లీన్ గా ఉండాలనుకుంటాం.. అది ఇంట్లో అయినా సరే.. లేకపోతే బయట హోటల్లో అయినా సరే .. అయితే పాపం ఓ మహిళకు ఇలా తినే సమయంలో వికారం కలిగించే అనుభవం ఎదురైంది. స్నాక్స్ తింటుండగా పైనుంచి ఓ చచ్చిన ఎలుక ఆమె ప్లేట్ పక్కన పడింది. వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన బెంగళూరు ఐకియా స్టోర్ లో జరిగింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఐకియా స్టోర్‌లో ఓ మహిళకు దారుణం అయిన అనుభవం ఎదురైంది. శరణ్య అనే యువతి తొలిసారి తన స్నేహితులతో కలిసి నగరంలోని నేలమంగళలోని ఐకియా స్టోర్‌కు వెళ్లారు. కొంత షాపింగ్ అయిన తరువాత స్టోర్‌లోని ఫుడ్‌కోర్టులో స్నాక్ తింటుండగా ఆమె టేబుల్‌పై ఓ చచ్చిన ఎలుక పడింది. విషయం అక్కడి సిబ్బంది చెప్పడంతో వారు ఎవరెవరికో ఫోన్ చేశారు కానీ వెంటనే వచ్చి దానిని తీయడం కానీ, కవర్ చేయడం కానీ చేయలేదని శరణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత టేబుల్ మార్చారు తప్పితే శానిటైజ్ కూడా చేయలేదని పేర్కొన్నారు. అక్కడ చాలామంది ఉండడంతో తాను గొడవ చేయాలని అనుకోలేదని సైలెంటుగా బయటకు వచ్చేశామని తెలిపారు. తింటున్న స్నాక్స్ వదిలేసి పక్కనే పడివున్న ఎలుక ఫొటోను తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు.' నా ఫుడ్ టేబుల్‌పై ఏం పడిందో ఊహించండి 'అంటూ ఓ క్యాప్షన్ జత చేశారు.
అయితే ఆమె ట్వీట్ వైరల్ కావడం, నెటిజన్లు విమర్శలు కురిపించడంతో ఐకియా స్టోర్ యాజమాన్యం స్పందించింది. జరగిన ఘటనపై శరణ్యకు తమ క్షమాపణలు తెలిపింది. ఈ విషయం పై తాము దర్యాప్తు చేస్తామని, అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. అంతేకాదు తాము పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com