Bengaluru Murder Case: మహాలక్ష్మి హత్య కేసులో సంచలనం..అనుమానితుడి ఆత్మహత్య

బెంగళూర్ మహాలక్ష్మి హత్య కేసులో సంచలనం నెలకొంది. ఈ హత్యలో కీలక నిందితుడిగా భావిస్తున్న సహోద్యోగి ముక్తి రంజన్ రాయ్ బుధవారం ఒడిశాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హత్య అనంతరం బెంగళూర్ నుంచి ఒడిశాకు పారిపోయాడు. విచారణలో భాగంగా రాయ్‌ని పట్టుకునేందుకు బెంగళూర్ పోలీసులు ఒడిశాకు వెళ్లారు. అయితే, వారు అతడిని అదుపులోకి తీసుకునే ముందే రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అంతకుముందు రోజు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. నిందితుడు వేరే రాష్ట్రానికి చెందిన వాడని, అతడిని పట్టుకునే పనిలోనే ఉన్నామని చెప్పారు. ఒడిశాలో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు బెంగళూర్ నుంచి పోలీస్ టీంలు వెళ్లాయి. మూడు నుంచి నాలుగు పోలీస్ బృందాలు ఒడిశాకు వెళ్లినప్పటి నుంచి నిందితుడు తన స్థలాలను మారుస్తూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎలాగూ పోలీసులకు చిక్కుతాననే భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ముక్తి రంజన్ మంగళవారం సొంతూరు ఒడిశాలోని భద్రక్ జిల్లా ఫండి గ్రామానికి వచ్చాడు. గత రాత్రి ఇంటి నుంచి స్కూటర్‌పై బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం కూలేపాడు శ్మశాన వాటిక సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ల్యాప్ టాప్ స్కూటర్‌లోనే ఉండిపోయింది. ఘటన జరిగిన ప్రాంతం దుషిరి పోలీస్ స్టేషన్ పరిధి కిందకు వస్తుంది. మహాలక్ష్మి ముఖ్య స్నేహితుల్లో ముక్తి ఒకడు. మహాలక్ష్మి వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం పట్ల ముక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు.
సెప్టెంబర్ 22న మహాలక్ష్మీ తన నివాసంలో అత్యంత దారుణంగా హత్య చేయబడింది. ఆమె శరీరాన్ని ఛిద్రం చేసి, 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మహాలక్ష్మీకి హేమంత్ దాస్ అనే వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అయితే, హేమంత్ దాస్ తన భార్యకు అష్రాఫ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అతడి పైనే అనుమానం ఉందంటూ ఆరోపించాడు. తాజాగా విచారణలో మహాలక్ష్మీతో పనిచేసే ముక్తి రంజన్ రాయ్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు. తీరా అతడిని పట్టుకునేలోపే ఆత్మహత్య చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com