పెరుగుతున్న ట్రాఫిక్.. పాఠశాలల సమయాల్లో మార్పు!!

బెంగళూరులో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ను తగ్గించడానికి పాఠశాల సమయాలను సర్దుబాటు చేసే విషయంపై దృష్టి సారించింది. రాష్ట్ర రవాణా శాఖ నిర్దిష్ట రహదారులపై కూడా రద్దీ పన్నును అమలు చేసే ఆలోచనలో ఉంది.
కర్ణాటక విద్యాశాఖ పాఠశాల సమయాల్లో ప్రతిపాదిత మార్పులపై చర్చించేందుకు సమావేశమవుతుంది. ప్రైవేట్ పాఠశాలల సంఘం, తల్లిదండ్రులు, పాఠశాల వాహనాల సంఘం వారి సలహాలు, సూచనలు తీసుకోవడానికి వారితో మరో సమావేశం నిర్వహించనున్నారు. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పాఠశాలలు, పారిశ్రామిక సంస్థల షెడ్యూల్‌లను సవరించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతూ ఇటీవలి హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం చర్చలకు ఉపక్రమించింది. పిల్లల భద్రతకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సహకరించాల్సిన అవసరాన్ని కోర్టు ఆదేశం నొక్కి చెప్పింది.
అయితే ఈ విషయంపై తల్లిదండ్రుల వెర్షన్ వేరేగా ఉంది. ''బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ పాఠశాల సమయాల్లో మార్పు ప్రభావం పిల్లలపై ఎంతగానో ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలకు సాధారణ దినచర్య అవసరం, పాఠశాల సమయాలను మార్చితే వారిపై ఒత్తిడి కలుగుతుంది అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా తుది నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల్లో ఆలోచించాల్సి అవసరాన్ని నొక్కి చెప్పారు.
"పాఠశాల సమయాలలో మార్పులు అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలలో అమలు చేయాలి, కానీ అన్ని పాఠశాలల్లో కాదు అని వారి అభిప్రాయం. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమయ మార్పులకు సర్దుబాటు చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇది వారిని మానసికంగా కూడా ప్రభావితం చేయవచ్చు" అని మరో విద్యార్థి తండ్రి వాపోతున్నారు.
పాఠశాల సమయాల్లో మార్పులతో పాటు, నగరంలో రద్దీగా ఉండే రహదారులపై రద్దీ పన్ను అమలును కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రతిపాదిత పన్ను నగర రోడ్లపై ప్రైవేట్ వాహనాల సంఖ్యను తగ్గించడం మరియు ప్రజా రవాణా సేవలను వినియోగించుకునేలా ఎక్కువ మందిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. FASTag వ్యవస్థ ద్వారా రద్దీ పన్ను వసూలు సులభతరం చేయబడుతుంది.
ఇటువంటి పన్ను వల్ల ఈ రహదారులపై ప్రైవేట్ వాహనాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని, ప్రజా రవాణా సేవలను ఎంచుకునేలా ఎక్కువ మందిని ప్రోత్సహించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR), ఓల్డ్ మద్రాస్ రోడ్, ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్ (OAR), సర్జాపూర్ రోడ్, బన్నెరఘట్ట రోడ్, హోసూర్ రోడ్, తుమకూరు రోడ్, బళ్లారి రోడ్, కనకపుర రోడ్, మగడి వంటి గుర్తించబడిన రహదారులు త్వరలో రద్దీ పన్ను పరిధిలోకి రానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com