Bengaluru CEO: భర్తపై ద్వేషమే చిన్నారి మరణానికి కారణం

నాలుగేళ్ల కుమారుడిని అమానవీయంగా కడతేర్చిన కసాయి తల్లి సుచనాసేఠ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతదేహాన్ని బెంగళూరు తరలించడానికి ట్యాక్సీకి 30 వేల రూపాయలను చెల్లించేందుకు ఆమె అంగీకరించినట్లు స్పష్టమయింది. అసలు ఆమెపై అనుమానం రావడానికి దారితీసిన హోటల్‌గదిలో రక్తం సుచనాసేఠ్ దేనని పోలీసులు నిర్ధరించారు. మరోవైపు ఆమె పోలీసులకు అసలు సహకరించడం లేదని సమాచారం.
కుమారుడిన కడతేర్చి మృతదేహాన్ని బ్యాగులో తరలిస్తూ దొరికిపోయిన మైండ్‌ఫుల్ CEO సుచనాసేఠ్ విచారణలో పోలీసులు మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. హత్యను దాచేందుకు గోవా నుంచి బెంగళూరుకు ట్యాక్సీలో వెళ్లాలని నిర్ణయించుకున్న ఆమె.. అందుకు 30వేలు చెల్లించేందుకు సిద్ధమైంది. విమానంలో వెళ్తే 2600 నుంచి 3000లకే వెళ్లవచ్చన్నా.. సుచనా నిరాకరించినట్లు హోటల్ సిబ్బంది చెప్పారు. జనవరి 6 నుంచి 10 వరకు హోటల్‌గదిని బుక్ చేసుకున్నా.. 8వ తేదీ రాత్రి ఒంటిగంటకు చెక్‌ఔట్ అయిందని వివరించారు. అయితే ఈ మధ్య సమయంలో ఆమె ఒక్కసారి కూడా బయటకు రాలేదని తెలిసింది.
సుచనాపై హోటల్ సిబ్బందికి అనుమానం రావడానికి కారణమైన గదిలో రక్తపుమరకల అంశంపై స్పష్టతవచ్చింది. సుచనా చేతికి గాయం అయిన కారణంగా రక్తం పడినట్లు పోలీసులు చెప్పారు. కుమారుడి హత్యకు ఒకరోజు ముందే సుచనా.. తన భర్తకు కొన్ని మెస్సేజ్‌లు చేసినట్లు తెలిసింది. వచ్చి కుమారుడిని చూసుకోవచ్చంటూ ఆమె.. సందేశం పంపింది. అయితే అప్పటికే ఆమె బెంగళూరు నుంచి గోవాకు వెళ్లింది. భర్త వెంకట రమన్ కూడా ఇండోనేషియా అదే రోజు పయనమయ్యాడు. కాబట్టి కుమారుడిని చూసేందుకు ఆయనకు వీల్లేకుండాపోయిందని పోలీసుల విచారణలో తెలిసింది.
కుమారుడి హత్యపై సుచనాసేఠ్ ఇప్పటివరకు పశ్చాత్తాపం చెందలేదనీ అసలు ఆమే ఈ హత్య చేసినట్లు ఒప్పుకోవడం లేదని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని మాయం చేయాలని ఆమె ఎలాంటి ప్రణాళిక వేసుకోలేదనీ ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కే తరలించాలని అనుకున్నానని తమకు చెప్పిందని వివరించారు. విచారణకు సుచనా ఏమాత్రం సహకరించడం లేదనీ.. ఆమె మానసిక స్థితిని అంచనా వేయడానికి నిపుణుల సాయం తీసుకోనున్నట్లు చెప్పారు. సుచనా.. తన కుమారుడిని గోవాలోని ఓ హోటల్‌లో ఊపిరాడకుండా చేసి హతమార్చి మృతదేహాన్ని లగేజీ బ్యాగులో కుక్కి.. కర్ణాటక తరలిస్తుండగా పోలీసులకు చిక్కింది. వెంకటరమన్‌తో విడాకుల ప్రక్రియ కొనసాగుతున్న వేళ., కుమారుడ్ని ప్రతీ ఆదివారం కలుసుకోవచ్చని భర్తకు కోర్టు అనుమతించిన కారణంతో ఆమె హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com