భారతీయ చిన్నారిని జర్మనీకే అప్పగించిన బెర్లిన్ కోర్ట్

భారతీయ సంతతికి చిన్నారి అరిహా షా బాధ్యతలను జర్మనికే అప్పగిస్తూ బెర్లిన్ కోర్ట్ తీర్పు వెలువరించింది. దీంతో దాదాపు 2 ఏళ్లుగా ఆమె తల్లిదండ్రులు చేస్తున్న పోరాటం వృథా అయింది. అయితే ఈ తీర్పును అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ తల్లిదండ్రులు ఆనందం కోల్పోయి 2 సంవత్సరాలు అయ్యింది. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి. అయినా సరే వారు పోరాటం కొనసాగించారు. కానీ ఫలితం లేకపోయింది. ఇప్పుడు కోర్టు తీర్పు వారిని మరింత దుఃఖం లోకి నెట్టేసింది. అయినప్పటికీ వారు తమ ధైర్యం కోల్పోవడం లేదు. అరిహా బాధ్యతను 140 కోట్ల భారతీయులకు అప్పగిస్తున్నామన్నారు. కేంద్రం పై తమకు నమ్మకం ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసు వివరాల్లోకి వెళితే
ముంబైకి చెందిన భవేష్ షా, ధారా షా దంపతులు 2018లో ఉపాధి కోసం జర్మనీకి వెళ్లారు. వారిద్దరికి అక్కడే అరిహా షా జన్మించింది. ఏడు నెలల వయసు ఉన్నప్పుడు ఆ చిన్నారి ఒకరోజు ఆడుకుంటూ కింద పడింది. దీంతో ప్రైవేటు పార్ట్ వద్ద దెబ్బ తగిలింది. వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే చికిత్స చేసిన వైద్యులు అది లైంగిక వేధింపుల కేసులా కనిపిస్తోంది అంటూ పిల్లల సంరక్షణ బృందానికి సమాచారం అందించారు.
దీంతో చిన్నారి సంరక్షణ బాధ్యతలను జర్మనీ అధికారులు తీసుకున్నారు. ఈ ఘటన 2021 సెప్టెంబరులో జరిగింది. అప్పటి నుంచి 20 నెలలుగా అరిహా.. జర్మనీ అధికారుల సంరక్షణలోనే ఉంటోంది. ఒకానొక సమయంలో పోలీసులు కేసుని మూసివేసినప్పటికీ, జర్మనీ చైల్డ్ సర్వీసెస్ అధికారులు పాపను తిరిగి ఇవ్వకపోగా దంపతులపైనే కేసు నమోదు చేశారు. పాపను పెంచే సమర్థతను నిరూపించుకోవాల్సిందిగా న్యాయస్థానం వారిని ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఆ పరీక్షల్లో ఫలితాలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా రావడంతో అరిహా ను తల్లిదండ్రులు దక్కించుకోలేక పోయారు.
పాపను కలిసేందుకు మాత్రం ప్రతినెల గంట పాటు అనుమతిస్తున్నారు. పూర్తి హక్కు కోసం అరిహా తల్లిదండ్రుల న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే వీరి వీసా గడువు మరో 2 నెలల్లో ముగియనుండటంతో ఇప్పుడు మరింత ఆందోళన చెందుతున్నారు. అరిహాను భారత్‌కు తీసుకురావటంలో తమకు సహాయం చెయ్యాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌కు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేకు కూడా భవేష్ షా దంపతులు లేఖ రాశారు. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం అరిహాను త్వరగా భారత్‌కు పంపించాలని జర్మనీకి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన 19 పార్టీలకు చెందిన 59 మంది ఎంపీలు భారత్‌లో ఉన్న జర్మనీ రాయబారికి లేఖ రాశారు. ఇప్పటికీ తమ కుమార్తె అరిహాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌లు తిరిగి భారత్‌కు తీసుకొస్తారని నమ్మకంతో ఉన్నామని భవేష్ షా దంపతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అరిహాను 140 కోట్ల మంది భారతీయులకు అప్పగిస్తున్నామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com