Train accident: కవరైపెట్టై రైలు ప్రమాదంలో కుట్ర కోణం?

‘బాలాసోర్‌’ను గుర్తు చేసిందన్న అధికారులు

తమిళనాడులో శుక్రవారం సాయంత్రం ని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై భిన్న కోణాల్లో విచారణ మొదలైంది. సాంకేతిక లోపమా? సిగ్నలింగ్‌ వైఫల్యమా? కుట్ర కోణమా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా.. అన్నది తేల్చేందుకు ఎన్‌ఐఏ, రైల్వే భద్రతా విభాగాలు విచారణ చేపట్టాయి.

కర్ణాటకలోని మైసూరు నుంచి బిహార్‌లోని దర్బంగాకు బయల్దేరిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578) కవరైపెట్టై సమీపంలో ప్రధాన లైన్‌లో కాకుండా, లూప్‌లైన్‌లోకి వెళ్లి గూడ్స్‌రైలును ఢీకొన్న ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా, పలువురు గాయపడ్డారు. 12 బోగీలు గాల్లోకి లేచి చెల్లాచెదురుగా పడ్డాయి. విచారణ నిమిత్తం రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శని, ఆదివారాల్లో ఘటనాస్థలిని పరిశీలించారు. జాగిలాలను రప్పించి, ఆధారాలు సేకరించారు. గతేడాది ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ప్రమాదం కూడా ఇదే తరహాలోనే ఉండటంతో తాజా దుర్ఘటన వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా అన్న కోణంలో కూపీ లాగుతున్నారు. రైల్వేస్టేషన్‌లో రికార్డయిన డేటా లాగర్‌ను తీసుకొని, ప్రమాదానికి ముందు, తర్వాత ఏం జరిగిందో పరిశీలించారు. ప్రమాదానికి 7 నిమిషాల ముందు పొన్నేరి నుంచి కవరైపెట్టై స్టేషన్‌ మీదుగా గుమ్మిడిపూండి వైపు ఓ రైలు వెళ్లింది. అది ఎక్కడా లూప్‌లైన్‌లోకి వెళ్లలేదు. తర్వాత వచ్చిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ మాత్రం ప్రధాన లైనులో గ్రీన్‌ సిగ్నల్‌ ఉన్నా, లూప్‌లైన్‌లోకి వెళ్లి, గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. ఈ 7 నిమిషాల్లో లోపం ఎక్కడ జరిగిందో తేల్చే పనిలో ఎన్‌ఐఏ నిమగ్నమైంది.

ట్యాంపరింగ్‌ అనుమానాలు ?

కవరైపెట్టై స్టేషన్‌మాస్టర్‌ మునిప్రసాద్‌బాబు ఫిర్యాదు మేరకు రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. రైలు ట్రాక్‌ మారడానికి వాడే సిగ్నలింగ్‌ గేర్, స్విచ్‌ పాయింట్ను ట్యాంపర్‌ చేసినట్లు వారు అనుమానించినట్లు తెలుస్తోంది. ఇక్కడికి సమీపంలోని పొన్నేరి రైల్వేస్టేషన్‌లో ఇటీవలే పట్టాల ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థను ట్యాంపరింగ్‌ చేసినట్లు బయటపడటం ఇందుకు బలాన్నిస్తోంది. బెంగళూరు నుంచి వచ్చిన దక్షిణ సర్కిల్‌ పరిధి రైల్వే భద్రతా కమిషనర్‌ ఎ.ఎం.చౌదరి బృందం లోతుగా తనిఖీ చేసింది. ఆర్‌పీఎఫ్‌ సైతం విచారణ చేపట్టింది. ఘటనా స్థలంలో పట్టాలకు సంబంధించిన బోల్టులు, నట్లు కొన్ని మాయమైనట్లు గుర్తించారు. సిగ్నల్‌ వైఫల్యం ఉందా.. అని ఆరా తీశారు. మరోవైపు ప్రమాద స్థలంలో దెబ్బతిన్న కోచ్‌లన్నింటినీ తొలగించి శనివారం రాత్రికి ఒక లైన్, ఆదివారం ఉదయానికి మరో లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడీ మార్గంలో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని దక్షిణ రైల్వే ప్రకటించింది. భాగమతి రైళ్లోని ప్రయాణికులను మరునాడు ఉదయాన్నే చెన్నై నుంచి ప్రత్యేక రైలులో దర్బంగాకు పంపించారు. ఇందులో బిహార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులూ ఉన్నారు.

Tags

Next Story