Bhajan Lal Sharma : రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా భజన్‌లాల్ శర్మ ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా.. భజన్‌లాల్‌తో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాల ప్రమాణం చేశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, నితిన్ గడ్కరీతోపాటు రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాత్ తదితరులు హాజరయ్యారు.
56 ఏండ్ల భజన్‌లాల్ శర్మ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నాలుగుసార్లు ఈ పదవి చేపట్టారు. ఆయనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) మద్దతు ఉన్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన సంగనేర్ నియోజకవర్గం నుంచి 48 వేల ఓట్లకు పైగా మెజార్టీతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ఏబీవీపీతోనూ గతంలో సంబంధాలు ఉన్నాయి. భజన్‌లాల్ పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు. ఆయన ఓ బ్రాహ్మన వర్గానికి చెందిన వారు.
రాజస్థాన్‌లో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 199 స్థానాలకు గానూ బీజేపీ 115 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ 69 సీట్లకు పరిమితమైంది. ఎన్నికల్లో భాజీ మెజారిటీ సాధించిన బీజేపీ.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత గత వారం రోజులుగా కొత్త సీఎంగా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఈ జాబితాలో మాజీ సీఎం వసుంధరా రాజే వంటి వాళ్లు ఉన్నారు. ఫలితాల వచ్చిన నాటి నుంచే సీఎం పదవి పొందేందుకు రాజే గట్టిగా ప్రయత్నాలు చేశారు. వరుసగా పలుమార్లు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం అవుతూ అధిష్ఠానానికి తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు.
వసుంధరా రాజేతోపాటు రాజస్థాన్ యోగిగా పేరుపొందిన బాబా బాలక్‌నాథ్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్ పేర్లు కూడా సీఎం రేసులో ప్రముఖంగా వినిపించాయి. అయితే వీరందరినీ కాదని రాష్ర్టానికి కొత్త సీఎంగా బీజేపీ అధిష్ఠానం తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్ శర్మ వైపు మొగ్గు చూపడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com